ప్రపంచ పోరాటాల చరిత్రలోనే స్వాతంత్య్ర పోరాటానిది మహోన్నత ఘట్టమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట స్వాతంత్య్ర సంబురాలను జాతీయ పతాకం ఆవిష్కరించి ప్రారంభించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్... మువ్వన్నెల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్నాయని... ఈ సందర్భంగా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలను ఉద్యమంలో మమేకం చేయడంలో గాంధీ విజయం సాధించారన్న సీఎం... మహాత్ముడి ఆశయాలు ఎంతోమందికి ప్రేరణగా నిలిచాయన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించే సమయంలో గాంధీ ఉద్యమ స్ఫూర్తిని మననం చేసుకున్నానని తెలిపారు.