రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించడం వల్ల ప్రజాజీవనం స్తంభించడంతో పాటు... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదముందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో లౌక్‌డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదన్నారు. కరోనా పరిస్థితులపై ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం... రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతవరకు ఆక్సిజన్ అందుతున్నది... ఇంకా ఎంత కావాలి...? వాక్సిన్‌లు ఎంత మేరకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా రోజుకు ఎంత అవసరం...? వంటి అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోము: సీఎం కేసీఆర్ - kcr on lockdown in telangana
21:47 May 06
కరోనా పరిస్థితులపై సీఎం సమీక్ష
రెమ్‌డెసివిర్ తయారీ సంస్థలతో ఫోన్లో మాట్లాడిన సీఎం... వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,500 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని... వాటిని హైదరాబాద్ సహా జిల్లాల్లో కలిపి మరోవారం రోజుల్లో మరో 5 వేలకు పెంచాలన్నారు. మెరుగైన ఆక్సిజన్ సరఫరాకోసం ఒక్కోటి కోటి రూపాయల చొప్పున 12 క్రయోజనిక్ ట్యంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు.
ప్రధాని మోదీకి ఫోన్...
రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ సరఫరా గురించి ప్రధాని మోదీతో ఫోన్ మాట్లాడారు. వాటిని తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరు, కర్ణాటక బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్... అందడంలేదని ప్రధాని దృష్టికి తెచ్చారు. తెలంగాణ చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కరోనా బాధితులు రావడం వల్ల... భారం పెరిగిందని ప్రధానికి వివరించారు. రాష్ట్రానికి ప్రస్తుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందుతోందని... దాన్ని 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానిని కోరారు.
కేంద్రం భరోసా...
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు 4,900 మాత్రమే అందుతున్నాయని... ఆ కోటాను 25 వేలకు పెంచాలని మోదీని కోరారు. కేంద్రం ఇప్పటివరకు 50 లక్షల డోసుల వాక్సిన్ అందించిందని... రాష్ట్రంలో రోజుకు 2 నుంచి 2.5 లక్షల డోసులు అవసరం ఉందని వివరించారు. వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు.... కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. ప్రధాని మోదీకి కేసీఆర్ విన్నవించిన అంశాలన్నింటిని సత్వరమే తెలంగాణకు సమకూరుస్తామని గోయల్ తెలిపారు. ఆక్సిజన్ కర్ణాటక తమిళనాడు నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాలనుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు.
భయపడకండి..
కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావద్దని సీఎం కోరారు. ఎవరికైనా ఏ మాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కొవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఎన్ఐఎంల ద్వారా ఇంటింటికీ అందచేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.