'ఇవి మున్సిపల్ ఎన్నికలా..? జాతీయ ఎన్నికలా..?' దురదృష్టవశాత్తూ హైదరాబాద్‌లో వరదలు వచ్చాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో మునిగి కన్నీళ్లు పెట్టుకున్న పేదలను చూసి బాధతో... ఇంటికి రూ.10 వేలు ఇచ్చానని తెలిపారు. వరదల సమయంలో రాష్ట్ర మంత్రులు బాధితులకు అండగా ఉన్నారని తెలిపారు.
వరద బాధితులను ఆదుకునేందుకు రానివారు ఓట్ల కోసం వరదలా వస్తున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. బక్క కేసీఆర్ కొట్టేందుకు ఇంత మంది వస్తారా? అని తనదైన శైలిలో చురకలంటించారు. ఇవి మున్సిపల్ ఎన్నికలా..? జాతీయ ఎన్నికలా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మూస రాజకీయాలు పోవాలని ప్రజలకు సూచించారు.
దేశంలో చాలా నగరాల్లో వరదలు వస్తే కేంద్రం ఆదుకుంది కానీ... హైదరాబాద్‌ను మాత్రం పట్టించుకోలేదు. హైదరాబాద్ నగరం దేశంలో భాగం కాదా? ప్రధానిని రూ.1300కోట్లు అడిగితే 13 పైసలు ఇవ్వలేదు. వరద సాయం అందిస్తే కొందరు కిరికిరి పెడుతున్నారు.- సీఎం కేసీఆర్.
డిసెంబర్ 7 నుంచి వరద బాధితులకు రూ.10వేలు అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.650 కోట్ల సాయం అందించామన్న కేసీఆర్... మిగిలిన బాధితులకు సైతం డబ్బులు ఇస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌ను అన్ని విధాల బాగు చేస్తామని తెలిపిన కేసీఆర్... తెరాసను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.