తెలంగాణ

telangana

ETV Bharat / city

CM KCR: రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ: కేసీఆర్‌ - golkonda celebrations

హైదరాబాద్​లో ఘనంగా నిర్వహిస్తోన్న 75వ స్వాతంత్ర్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్​ పాల్గొన్నారు. గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతి నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్​.. ప్రజల ముందుంచారు. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని ఉద్ఘాటించారు.

CM KCR Speech in independence day celebrations at golkonda
CM KCR Speech in independence day celebrations at golkonda

By

Published : Aug 15, 2021, 11:13 AM IST

Updated : Aug 15, 2021, 12:52 PM IST

రాష్ట్రం ఏర్పడే నాటి పరిస్థితులకు, నేటికి అసలు పోలికే లేదని... అన్ని రంగాల్లో గుణాత్మక, గణనీయ అభివృద్ధిని ఆవిష్కరించామని ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. 75 వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్​.. గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాట ఉజ్వల ఘట్టాలను దేశం స్మరించుకుంటోందన్నారు. స్వాతంత్ర్య ఫలాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.

దేశానికి ఆదర్శంగా తెలంగాణ...

"రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రచించుకున్నాం. ప్రగతి ఫలాలు ప్రజల అనుభవంలోకి వచ్చాయి. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాం. విద్యుత్, తాగు, సాగునీటి రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శం. ఏడేళ్లలోనే స్థిర ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. 2013 -2014లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4,51,580 కోట్లు ఉండగా... 2020-2021లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,80,407 కోట్లకు చేరింది. కరోనా తీవ్ర అవరోధాలు సృష్టించినా అభివృద్ధి ఆగలేదు. 2013-2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,12,126 కాగా.. నేడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,37,632గా ఉంది. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు. తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది."- కేసీఆర్​, ముఖ్యమంత్రి


వ్యవసాయ రంగంలో అసాధారణ అభివృద్ధి

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అసాధారణ అభివృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. 3.40 కోట్ల టన్నుల దిగుబడితో దేశంలోనే అగ్రస్థానం సాధించామన్నారు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 20 శాతమని తెలిపారు. తెలంగాణ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ అవతరించిందన్నారు. 2013-14 లో రాష్ట్రంలో 49 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేవారని... 2020-21లో కోటి 6 లక్షల ఎకరాల్లో వరిపంట సాగవుతోందన్నారు. 60.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతోందని... పత్తి సాగులో రాష్ట్రానిది దేశంలో రెండో స్థానమన్నారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రానిదే అగ్రస్థానమని తెలిపిన కేసీఆర్​.. ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యంలో రాష్ట్రం 56 శాతం అందించిందన్నారు.

రుణమాఫీ.. బీమా..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశామని కేసీఆర్​ తెలిపారు. 3 లక్షలమంది రైతులకు రూ.25 వేల వరకూ పంట రుణాల మాఫీ చేసినట్టు వివరించారు. రేపట్నుంచే 6 లక్షలమంది రైతులకు రూ.50 వేల లోపు పంట రుణాల మాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. కొత్త భూపరిపాలన విధానం తెచ్చి ధరణి తీసుకొచ్చామన్నారు. సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణయుగాన్ని సృష్టిస్తోందన్నారు. వృద్ధాప్య పింఛను అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించామన్నారు. త్వరలో రైతు బీమా తరహాలో చేనేత బీమా పథకం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

సౌర విద్యుత్​ ఉత్తత్తిలో రెండో స్థానం...

" విద్యుత్ కష్టాలకు చరమగీతం పాడి తెలంగాణ చరిత్రకెక్కింది. అన్ని రంగాలకూ 24 గంటలూ విద్యుత్ ఇస్తున్న ఒకే రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ సామర్థ్యం 7,788 మెగావాట్లు మాత్రమే. ప్రస్తుతం విద్యుత్ సామర్థ్యం 16,425 మెగావాట్లకు పెరిగింది. సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రానిది దేశంలో 2వ స్థానం. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2012 యూనిట్లకు పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రానిది దేశంలో మొదటిస్థానం. నల్గొండ జిల్లాలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నాం. యాదాద్రి పవర్ ప్లాంట్ అతిపెద్ద ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణమవుతోంది."- కేసీఆర్​, ముఖ్యమంత్రి

ఆరోగ్య సర్వే సూచీల్లో మనమే ఫస్ట్​..

కరోనా కష్టాలను అధిగమించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ కొవిడ్ వైద్య కేంద్రాల్లో 27,996 పడకలు ఏర్పాటు చేయగా.. 17,114 పడకలను ఆక్సిజన్ పడకలుగా అభివృద్ధి చేశామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో డయాగ్నొస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. డయాగ్నొస్టిక్ కేంద్రాలలో ఉచితంగా 50కి పైగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లో 224 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో తొలిసారి ప్రసూతి ఐసీయూ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సూచీల్లో.. బాలింత, నవజాత శిశు మరణాలు అరికట్టడంలో రాష్ట్రానిదే తొలిస్థానమన్నారు.

సమర్థంగా సంక్షేమ పథకాల అమలు...

"అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నాం. మారుమూల తండాలను ప్రత్యేక పంచాయతీలుగా మార్చాం. గ్రామ పంచాయతీల సంఖ్య 12,769కి పెరిగింది. 25 జిల్లాల్లో అధునాతన హంగులతో సమీకృత కలెక్టరేట్లు నిర్మిస్తున్నాం. ఇప్పటికే 4 భవనాలు ప్రారంభమయ్యాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. గ్రామాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాం. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ట్రాక్టర్లను అందించాం. కుల వృత్తులకు ప్రభుత్వం తిరిగి ఊపిరి పోసింది. రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి.. మత్స్యకారుల ఆదాయం పెరిగింది. నేడు రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు చేపల ఎగుమతి జరుగుతోంది. రూ.11 వేల కోట్లతో గొల్లకురుములకు పెద్దఎత్తున గొర్రెల పంపిణీ చేస్తున్నాం. దేశంలో గొర్రెలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాష్ట్రానిది తొలిస్థానం. పారిశ్రామిక, ఐటీ ప్రగతిలో దేశంలోనే ముందు వరుసలో ఉన్నాం."- కేసీఆర్​, ముఖ్యమంత్రి

ఉద్యోగాల కల్పనలో ఐటీ రంగం విశేష ప్రగతి...

టీఎస్ ఐపాస్ తెచ్చిన తర్వాత రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేసీఆర్​ పేర్కొన్నారు. గత ఏడేళ్లలో రాష్ట్రానికి 16,671 పరిశ్రమలు వచ్చాయన్నారు. 15,86,500 ఉద్యోగాల కల్పన జరిగిందని కేసీఆర్ స్పష్టం చేశారు. 2013-14లో రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు కాగా... 2020-21లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,45,522 కోట్లకు పెరిగిందన్నారు. ఉద్యోగాల కల్పనలో ఐటీ రంగం విశేష ప్రగతి సాధించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి 10 ఐటీ ఉద్యోగాల్లో మూడు తెలంగాణ కల్పించినవేనని వివరించారు.

ఇదీ చూడండి:

శతాబ్ది ఉత్సవాల నాటికి ప్రబలశక్తిగా భారత్: మోదీ

Last Updated : Aug 15, 2021, 12:52 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details