తెలంగాణ

telangana

ETV Bharat / city

పీవీకి భారతరత్న కోసం ప్రధాని వద్దకు వెళ్తా: కేసీఆర్​ - telangana government released 10 core for pv birth anniversary

దేశ గతిని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరాతానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇందు కోసం మంత్రివర్గం, శాసనసభలో తీర్మానం చేసి స్వయంగా ప్రధానిని కలుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. పీవీ సేవలు చిరస్మరణీయంగా నిలిచేలా ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తామన్న సీఎం.. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో వేడుకలు జరిగేలా చూస్తామన్నారు.

kcr on pv narasimharao
పీవీకి భారతరత్న కోసం ప్రధాని వద్దకు వెళ్తా: కేసీఆర్​

By

Published : Jun 24, 2020, 4:48 AM IST


తెలుగు బిడ్డ, దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్​ కె.కేశవరావు, సభ్యులు, ఉన్నతాధికారులు, పీవీ కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. విభిన్న రంగాల్లో పీవీ విశిష్ట సేవలు తలచుకునేలా, చిరస్మరణీయంగా నిలిచేలా ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడాది పొడవునా నిర్వహించాలని ఆదేశించారు.

పీవీ జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్‌లోని జ్ఞానభూమిలో శత జయంతి ప్రారంభ కార్యక్రమం జరగనుంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యతో నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌ ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అదే రోజు దాదాపు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు జరపాలన్న ముఖ్యమంత్ర.. వీటిని మంత్రి కేటీఆర్​ పర్యవేక్షిస్తారమని తెలిపారు.

నిధులు విడుదల

పీవీ తెలంగాణ ఠీవి అని ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఏడాది పొడవునా నిర్వహించాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు రూ. 10 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రాబోయే రోజుల్లో కార్యక్రమాలకు అనుగుణంగా నిధులను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

కలాం మెమోరియల్​ తరహాలో..

తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ తరహాలోనే హైదరాబాద్​లో పీవీ మెమోరియల్ ఏర్పాటుకావాలని కేసీఆర్​ తెలిపారు. కేకే నేతృత్వంలోని కమిటీ సభ్యులు రామేశ్వరం వెళ్లి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరతో పాటు దిల్లీలోని తెలంగాణ భవన్​లో పీవీ కాంస్య విగ్రహాల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన చిత్ర పటాన్ని పెట్టాలని... పార్లమెంటులోనూ పెట్టేందుకు కేంద్రాన్ని కోరతామని తెలిపారు.

తీర్మానాలు

పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని సీఎం తెలిపారు. ప్రధాని వద్దకు తానే స్వయంగా వెళ్లి కోరతానన్నారు. పీవీ స్మారక అవార్డును నెలకొల్పి క్రమం తప్పకుండా ఇవ్వాలని తెలిపారు.

రాష్ట్రపతి, ప్రధానికి ఆహ్వానం

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను జయంతి ఉత్సవాలకు ఆహ్వానించాలని తెలిపారు. పీవీతో ప్రత్యేక అనుబంధం ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లను కూడా భాగస్వాములను చేసేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలని సూచించారు. బిల్ క్లింటన్, జాన్ మేజర్ లాంటి వివిధ దేశాల మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు, మంత్రులతో కూడా పీవీకి అనుబంధం ఉందని గుర్తుచేశారు. వారి అభిప్రాయాలు తీసుకోవడం సహా అవసరమైతే వారిని భాగస్వాములు చేయాలని కోరారు.

ఇవీచూడండి:దేశ ఎగుమతుల్లో పెరిగిన రాష్ట్రవాటా... నివేదిక విడుదల చేసిన కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details