తెలంగాణ

telangana

ETV Bharat / city

KCR REVIEW: 'ఉద్ధృతంగా ఉన్న వాగులు దాటే సాహసం చేయొద్దు' - తెలంగాణలో వర్షాలుప

CM KCR REVIEW
CM KCR REVIEW

By

Published : Jul 22, 2021, 4:36 PM IST

Updated : Jul 22, 2021, 9:03 PM IST

16:34 July 22

భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్​లో సీఎస్, ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశమైన సీఎం.. వరదలు, సహాయక చర్యలపై సమీక్షిస్తున్నారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆరా తీసిన సీఎం.. ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

నిర్మల్​లో పరిస్థితిపై ఆరా

నిర్మల్‌ జిల్లాలో వరద పరిస్థితిపై ఆరా తీసిన సీఎం కేసీఆర్‌.. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన సీఎం.. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. 

అదనపు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. హెలికాప్టర్లు 

నదీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. పలు ప్రాజెక్టుల్లో వరద ప్రవాహ పరిస్థితి, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో తాజా పరిస్థితిపై సీఎం వాకబు చేశారు.  జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

కొత్తగూడెం, ఏటూరు నాగారం, మంగపేటపై అప్రమత్తంగా ఉండాలి. పర్యవేక్షణకు ఆర్మీ చాపర్‌లో సీనియర్ అధికారులను పంపాలి. ఆర్మూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను వెంటనే రక్షించాలి. నిరాశ్రయులకు వసతి, దుస్తులు, భోజనం ఏర్పాటు చేయాలి. కృష్ణా నదిలో కూడా ప్రవాహం పెరిగే పరిస్థితి ఉంది. నాగార్జునసాగర్ కేంద్రంగా ఉన్నతాధికారులను పంపించాలి. అదనపు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పించాలి. సహాయక చర్యలకు సరిపడా హెలికాప్టర్లు తెప్పించాలి. సాగు, విద్యుత్‌, పోలీస్ శాఖలను సంసిద్ధంగా ఉండాలి - కేసీఆర్, ముఖ్యమంత్రి

మూసీ వరద గురించి ఆరా తీసిన సీఎం.. ఫ్లడ్ మేనేజ్‌మెంట్ బృందాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలి తేల్చిచెప్పారు.  

 

హైదరాబాద్‌ డ్రైనేజీ పరిస్థితులపై ఆరా..

వరదను ఎదుర్కొనే పటిష్ఠ యంత్రాంగం ఏర్పాటు చేయాలి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురిశాయి. మహాబలేశ్వరంలో 70 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కృష్ణా నదిలోనూ వరద ఉద్ధృతి పెరగనుంది. కృష్ణా పరివాహకంలో వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలి - సీఎం కేసీఆర్ 

 

ఆగస్టు 10 వరకు వర్షాలు..

ఆగస్టు 10 వరకు వర్షాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఏడుగురు అధికారులతో వరద నిర్వహణ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల రక్షణ కోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం.. పరిస్థితులు అంచనా వేసి ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. రోడ్లు, వంతెనలను ఆర్‌ అండ్‌ బీ అధికారులు పరిశీలించాలని, ప్రజారవాణా వ్యవస్థను నియంత్రణ చేసుకోవాలి, ప్రజలు కూడా స్వీయ నియంత్రణ, జాగ్రత్తలు పాటించాలి కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్ధృతంగా ఉన్న వాగులు, వంతెనలు దాటే సాహసం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..

బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో... తక్షణమే పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. నిర్మల్ పట్టణం ఇప్పటికే నీటమునిగిందన్న ముఖ్యమంత్రి... అక్కడకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్​ను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇండ్లల్లోంచి బయటకు రావద్దని కేసీఆర్ సూచించారు.

 

ఇళ్లలో ఉండటమే క్షేమం...

గోదావరితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయన్న సీఎం కేసీఆర్​... ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల గేట్లు తెరుస్తున్నారన్నారు. రాష్ట్రంలోకి వరద ఉద్ధృతి మరింత పెరగనుందని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెరాస నేతలు పర్యవేక్షించాలని సూచించిన సీఎం... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రజలు బయటకు వెళ్లకుండా... ఇళ్లలో ఉండటమే క్షేమమని సూచించారు.  వాగులు, వంకలన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

కరవు పరిస్థితులు ఉత్పన్నం కావు..

మారిన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇకనుంచి కరవు పరిస్థితులు ఉండవన్న ముఖ్యమంత్రి... వరద పరిస్థితులు ఎదుర్కొనే పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. నీటిపారుదల, పంచాయతీరాజ్, పురపాలక, ఆర్ అండ్ బీ, రెవెన్యూ, వైద్య-ఆరోగ్య, సాధారణ పరిపాలనశాఖల నుంచి అనుభవం కలిగిన అధికారులతో వరద నిర్వహణ బృందాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. వరదలు ఉత్పన్నమైన సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించబడిన అధికారులను అందులో నియమించాలని సీఎస్​కు చెప్పారు. వివిధ శాఖలకు అప్రమత్తం చేసి, సమన్వయం చేయడంతో పాటు పునరావాస శిబిరాలు నిర్వహించే అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతి ఏడాది వరదల రికార్డును పాటించాలన్న ముఖ్యమంత్రి... పాత రికార్డు అనుసరించి ఆయా వరద సమయాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.  

సంబంధిత కథనాలు:

Last Updated : Jul 22, 2021, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details