పదో తరగతి పరీక్షల నిర్వహణపై నేడు కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో... నేటి నుంచి తలపెట్టిన పరీక్షలు ప్రభుత్వం వాయిదా వేసింది. కొంతకాలం వేచి చూసి కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించాలా? లేక పరీక్షలు రద్దు చేయాలా? అనే అంశంపై నేడు చర్చించనున్నారు. విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొన్నందున... పరీక్షలపై స్పష్టత ఇస్తూ ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
రద్దుకే మొగ్గు..!
జులైలో పరీక్షలు నిర్వహించాలనుకున్నా... అప్పుడు కూడా హైకోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనే అనుమానాలు విద్యాశాఖలో ఉన్నాయి. దాని వల్ల ఇంటర్, పాలిటెక్నిక్ విద్యా సంవత్సరాలు కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పదో తరగతి పరీక్షలు రద్దు చేసి అందరినీ పాస్ చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇంటర్నల్ పరీక్షల మార్కుల ఆధారంగా... గ్రేడ్లు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. పంజాబ్, మహారాష్ట్రలో పరీక్షలు లేకుండా ఎలా ప్రమోట్ చేశారో విద్యాశాఖ అధికారులు పరిశీలించి... సీఎంకు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం కోసం సుమారు ఐదున్నర లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.