కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వైరస్ సోకిన తర్వాత కూడా 80 శాతం మందిలో కనీసం వ్యాధి లక్షణాలు కూడా కనిపించడం లేదన్నారు. వారికి ఎలాంటి వైద్యం కూడా అవసరం లేదని అభిప్రాయపడ్డారు. 15 శాతం మందిలో జలుబు, జ్వరం, దగ్గు, దమ్ము లాంటి ఐఎల్ఐ లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఐఎల్ఐ లక్షణాలున్న వారు త్వరగానే కోలుకుంటారన్నారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
మిగతా 5 శాతం మందిలో మాత్రమే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే సారి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఈ 5 శాతం మంది విషయంలోనే ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు. వీరిలోనే మరణించే వారు ఎక్కువ ఉంటారని చెప్పారు. భారతదేశంలో 2.86 శాతం, తెలంగాణలో 2.82 శాతం మరణాల రేటు ఉందని తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ప్రజల కదలిక పెరిగిందని... ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వివిధ మార్గాల ద్వారా రాకపోకలు పెరిగాయన్నారు. అయినప్పటికీ వైరస్ ఉన్నట్లుండి ఉద్ధృతంగా వ్యాప్తి చెందలేదన్నారు. ఇది మంచి పరిణామమని... మొత్తంగా తేలేదిమిటంటే, కరోనా వైరస్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ వివరించారు. కానీ కరోనాకు వ్యాక్సిన్, ఔషధం రాలేదు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.