కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో హైదరాబాద్ నగరంలో సిటీబస్సులు ఇప్పుడే నడపరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మంగళవారం ప్రగతిభవన్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ , ఇతర అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. బస్సుల రవాణా, సంస్థ స్థితిగతులపై పూర్తిస్థాయిలో సమీక్షించారు. జిల్లాల్లో ప్రస్తుతం నడుస్తున్న బస్సుల తీరును ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల తీవ్రత అధికంగా ఉన్నందున ఇప్పట్లో సిటీబస్సులు తిప్పొద్దని సీఎం స్పష్టం చేశారు.
ఒప్పందం చేసుకున్నాకే..
అంతర్రాష్ట్ర సర్వీసుల విషయమై కూడా సమావేశంలో చర్చ జరిగింది. పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం చేసుకున్నాకే అంతర్రాష్ట్ర సర్వీసులను అనుమతించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అంతర్ రాష్ట్ర సర్వీసులకు సంబంధించి ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.