తెలంగాణ

telangana

By

Published : Apr 2, 2021, 8:07 PM IST

Updated : Apr 2, 2021, 8:28 PM IST

ETV Bharat / city

'హైదరాబాద్‌తో పోటీపడుతూ రంగారెడ్డి, మేడ్చల్ అభివృద్ధి చెందాలి'

హైదరాబాద్​తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల సమ్మిళితాభివృద్ధి కొనసాగేలా సమీకృత విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రెండు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల నిరంతర పర్యవేక్షణ కోసం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షనత నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తు తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రచించాలని కేసీఆర్ సూచించారు. భాగ్యనగరంతో పోటీపడుతూ శాటిలైట్ టౌన్​షిప్పులతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకొని రెండు జిల్లాల ముఖచిత్రం మారటం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

cm kcr review on  rangareddy and medchal districts development
cm kcr review on rangareddy and medchal districts development

'హైదరాబాద్‌తో పోటీపడుతూ రంగారెడ్డి, మేడ్చల్ అభివృద్ధి చెందాలి'

హైదరాబాద్ నగరంతో అనుసంధానమైన రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్​లో సీఎం సమావేశమయ్యారు. కాస్మోపాలిటన్ నగరంగా పురోగమిస్తోన్న హైదరాబాద్ నగరంలో భాగంగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయన్న సీఎం... భవిష్యత్ అవసరాల దృష్ట్యా సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. భాగ్యనగరంతో పాటు సమ్మిళితాభివృద్ధిని కొనసాగించేలా విస్తృత పరిధిలో ఒక సమీకృత విధానాన్ని రూపొందించుకోవాలన్న కేసీఆర్​.... నిరంతర పర్యవేక్షణ కోసం సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు.

అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయండి...

రెండు జిల్లాల ప్రజలకు హైద్రాబాద్ తరహాలో విద్య, వైద్యం లాంటి అన్ని రకాల సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తేవాలని చెప్పారు. ఏ నియోజకవర్గం పరిధిలో ఏ సమస్యలున్నాయో, వాటిని ఒక ప్రాజెక్టు రూపంలో స్థానిక ఎమ్మెల్యేలు తయారు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధికి ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం నోడల్ అధికారి నేతృత్వంలో పర్యవేక్షణ జరగాలన్న కేసీఆర్... నెలకోసారి క్రమం తప్పకుండా సమావేశం కావాలని సూచించారు. అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. ఇందులో భాగంగా రెండు జిల్లాల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీవనోపాధి కోసం తెలంగాణ సహా ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిరపడుతున్న నేపథ్యంలో భవిష్యత్ తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రచించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వీటన్నింటి కోసం నిధుల సమీకరణ, నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసి నగరం నలువైపులా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం కీలకమని సీఎం అన్నారు. అన్ని దిక్కుల్లో అన్ని రకాల పనులు సమాంతరంగా జరిగేలా చూడాలని చెప్పారు.

శాశ్వత పరిష్కారాలు అన్వేషించండి...

మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో త్వరలోనే సమావేశం నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్​ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇప్పటికే జనాదరణ పొందిన బస్తీ దవాఖానాలను ఈ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల ఆహార అవసరాలను గుర్తించి వారికి పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు వంటి ఆహారాన్ని అందుబాటులోకి తెస్తూ విశాలమైన స్థలాల్లో వెజ్, నాన్ వెజ్ సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్, పటిష్టంగా రోడ్ల నిర్మాణం, మురుగు నీరు - పారిశుధ్య నిర్వహణ, వరదల ముంపు సమస్యలను అధిగమించడం లాంటి పనులతో పాటు రెవెన్యూ, భూ రిజిస్ట్రేషన్ లాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలను అన్వేషించాలని అన్నారు. తద్వారా రెండు జిల్లాలు భవిష్యత్తులో హైదరాబాద్​తో పోటీ పడుతూ అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.

శాటిలైట్ టౌన్ షిప్పుల నిర్మాణంతో రెండు జిల్లాలు అత్యంత సుందరంగా రూపుదిద్దుకుని భవిష్యత్తులో హైదరాబాద్ ముఖచిత్రాన్ని మరింతగా మార్చివేయడం ఖాయమని కేసీఆర్ ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: దేశం గర్వించేలా ఐటీ రంగంలో తెలంగాణ టాప్: కేటీఆర్​

Last Updated : Apr 2, 2021, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details