తెలంగాణ

telangana

ETV Bharat / city

పల్లె ప్రగతి దేశానికే గర్వకారణం: సీఎం కేసీఆర్ - పల్ల ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

palle pragathi
palle pragathi

By

Published : Dec 29, 2020, 7:48 PM IST

Updated : Dec 29, 2020, 9:09 PM IST

19:45 December 29

పల్లెల రూపురేఖలు మారుస్తున్న పల్లెప్రగతి స్ఫూర్తి కొనసాగాలి: కేసీఆర్​

పల్లెసీమల రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి స్ఫూర్తిని కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. పల్లెప్రగతి పనులు తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుపుతున్నాయన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్​లో సమావేశమైన సీఎం... పల్లెప్రగతి కార్యక్రమంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పచ్చదనం – పరిశుభ్రత వెల్లివిరియాలని పల్లెప్రగతి ద్వారా ప్రభుత్వం ఆశించిందని... ఈ లక్ష్యం వందశాతం నెరవేరుతోందని అన్నారు.  

దేశానికే ఆదర్శంగా  

తెలంగాణ పల్లెలు పరిశుభ్ర, ఆరోగ్య ఆవాసాలుగా రూపాంతరం చెందాయి. ఈ ఏడాది డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలకపోవడానికి పల్లెప్రగతి ద్వారా చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలే కారణం. గ్రామాల్లో అన్ని  వసతులు సమకూరడం దేశంలో మరెక్కడా లేదు. తెలంగాణ పల్లెలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామాల్లో పచ్చదనం పెంపు, పరిశుభ్రత పాటించడాన్ని నిరంతరం కొనసాగించాలి. గతంలో గ్రామాల్లో పాలన, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా, అరాచకంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి పోయి పల్లెప్రగతి ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గ్రామాలు ప్రగతి పథాన నడుస్తున్నాయి.  

- కేసీఆర్​

పచ్చదనం పెంచేందుకు ప్రాధాన్యం  

గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్​ అన్నారు. ప్రతి ఇంటి నుంచి వారికి కావాల్సిన మొక్కల వివరాలు సేకరించి సరఫరా చేయాలని తెలిపారు. ఇళ్లకు పండ్లు, కరివేపాకు లాంటి మొక్కలను సరఫరా చేయాలని చెప్పారు. 19,595 ఆవాస ప్రాంతాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 18,968 ఆవాసాల్లో ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రకృతి వనాలను మరింత ఉపయోగకరంగా మార్చాలని... వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్​లు, సిమెంటు బెంచీలను పంచాయతీలు ఏర్పాటు చేయాలని చెప్పారు.  

ఆ షరతు పెట్టాలి

రాష్ట్రంలోని మొత్తం 12,734 గ్రామాల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం ప్రారంభమైంది. మిగిలిన కొద్దిచోట్ల కూడా త్వరలోనే నిర్మాణం జరుగుతుంది. 12,738 చోట్ల వైకుంఠ ధామాల నిర్మాణం జరుగుతోంది. రాబోయే మూడు నెలల్లో అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం పూర్తై అందుబాటులోకి రావాలి. రాష్ట్రం మొత్తాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చాలి. మిగిలిన గ్రామాల ప్రజలను కూడా  చైతన్య పరిచి వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగిన గ్రామాలుగా మార్చాలి. ఇంటినిర్మాణ అనుమతులకు వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలన్న షరతు పెట్టాలి.  

- కేసీఆర్​  

కేంద్ర బృందాలు ప్రశంసించాయి

ఉపాధిహామీ నిధులను సంపూర్ణంగా, సమర్థంగా, ప్రజోపయోగ పనుల కోసం వినియోగించే రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. పథకం ద్వారా అటు వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు, ప్రజలకు ఉపయోగపడే పనులను ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటికే రాష్ట్రంలో 14 కోట్ల పనిదినాలు కల్పించామని, ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 20 కోట్ల పనిదినాలు కల్పించే అవకాశం ఉందని చెప్పారు. కేంద్ర బృందాలు కూడా తెలంగాణలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ప్రశంసించడం గర్వకారణమన్నారు.

ఇదీ చదవండి :రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు

Last Updated : Dec 29, 2020, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details