తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆరు నెలల్లో డిండి: పాలమూరు-రంగారెడ్డి ఈ ఏడాదే పూర్తి!' - dindi project updates

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి, డిండి పనులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రెండు ప్రాజెక్టులకు నిధులు ఆగవద్దన్న సీఎం... బడ్జెట్లోనూ నిధులు కేటాయిస్తామని తెలిపారు. బిల్లుల చెల్లింపుల కోసం తక్షణమే రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. నిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం ఇచ్చి భూసేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మస్కూరీలకు శిక్షణ ఇచ్చి లష్కర్లుగా ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు.

cm kcr review on palamuru- rangareddy and dindi projects
cm kcr review on palamuru- rangareddy and dindi projects

By

Published : Jan 23, 2021, 8:25 PM IST

Updated : Jan 24, 2021, 6:18 AM IST

ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో ప్రగతిభవన్​లో సమావేశమైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... పాలమూరు – రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పంప్​హౌజ్​లు, జలాశయాలు, కాల్వలు, సొరంగ మార్గాల పనితీరును సమీక్షించారు. ఉద్దండాపూర్ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లు రూపొందించాలని ఇంజినీర్లను ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో కలిపితే 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

తక్షణమే నిధుల విడుదల...

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతే మొత్తం మహబూబ్​నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని సీఎం అన్నారు. వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి వందశాతం పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు. రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దన్న ముఖ్యమంత్రి... ఈ ఏడాది బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించేందుకు వీలుగా తక్షణమే రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.

పరిహారం చెల్లించండి...

రెండు ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణను పూర్తి చేసేందుకు తక్షణమే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను కోరారు. చట్ట ప్రకారం ఇవ్వల్సిన పరిహారం రైతులకు అందించి, వెంటనే భూ సేకరణ పూర్తి చేసి, భూమిని నీటి పారుదల శాఖకు అప్పగించాలని స్పష్టం చేశారు.

కోటి పది లక్షల ఎకరాల్లో వరి సాగు...

బీహెచ్ఈఎల్ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్​కు సీఎం తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఏడాది ముందుగా అన్ని చెరువులను నింపాలని, మిషన్ భగీరథకు నీరిచ్చేందుకు వీలుగా అన్ని జలాశయాల్లో కనీస నీటి వినియోగ పరిమాణాలను కొనసాగించాలని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు కేవలం 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగేదని... సాగునీటి వసతి పెరగటం వల్ల ఇప్పుడు కోటి పది లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు.

ఇది చారిత్రాత్మక నిర్ణయం...

కోటి పాతిక లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమతోందని, సాగునీటితో పాటు మిషన్ భగీరథ, పరిశ్రమలకు నీరందించే బాధ్యత కూడా నీటిపారుదల శాఖపైనే ఉందని అన్నారు. ప్రాధాన్యం, పరిధి పెరిగిన దృష్ట్యా సమర్థ నిర్వహణ కోసం నీటిపారుదల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకణ చేసినట్లు చెప్పారు. డీఈఈ స్థాయి మొదలు ఈఎన్సీ వరకు నిర్ధిష్టమైన ఆర్థిక అధికారాలు బదిలీ చేశామన్న ముఖ్యమంత్రి... తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా... స్థానిక అధికారులే మంజూరు చేసి, పనులు నిర్వహించేలా చేసినట్లు వివరించారు. ఇదో చారిత్రాత్మక నిర్ణయమని, దేశంలో ఎక్కడా ఈ విధానం లేదని వ్యాఖ్యానించారు. ఈ అధికారాలను సద్వినియోగం చేసుకుని చిన్నచిన్న పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ కోరారు.

మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వారికి తగు శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్లు వెల్లడించారు. పునర్వ్యవస్థీకరణతో విభజన, ఆయా అధికారులకు నిర్ణయించిన పరిధి సౌకర్యవంతంగా, పనులు చేసేందుకు అనువుగా ఉందా లేదా అన్న విషయమై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం సూచించారు. అవసరమైతే మార్పులు, చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణ పూర్తి చేసి భూమిని నీటి పారుదల శాఖకు అప్పగించాలన్నారు.

పంచాయతీ నుంచి సచివాలయం దాకా...

మిషన్ భగీరథ కోసం అన్ని జలాశయాల్లో కనీస నీటి నిల్వ ఉంచాలని సీఎం ఆదేశించారు. భగీరథ జలాలను ప్రజలు తాగేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ ద్వారా ఆరోగ్యకరమైన, పరిశుద్ధమైన మంచినీళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రజలు వాటిని తాగేలా ప్రోత్సహించాలని అధికారులను కోరారు. మిషన్ భగీరథ నీళ్లు ప్రస్తుతం బాటిళ్ల ద్వారా కూడా అందుబాటులోకి వచ్చినందున గ్రామ పంచాయతీ మొదలు రాష్ట్ర సచివాలయం వరకు వాటినే వినియోగించాలని సీఎం కోరారు. మిషన్ భగీరథ నీటిని తాగాలని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. భగీరథ నీళ్లలో అన్ని ఖనిజాలు తగిన పాళ్ళలో ఉన్నాయని చెప్పారు.

ఇదీ చూడండి:చంచల్​గూడ జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల

Last Updated : Jan 24, 2021, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details