తెలంగాణ

telangana

ETV Bharat / city

మేడారం వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి: సీఎం కేసీఆర్ - medaram jathara

మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 5 నుంచి జరిగే మహా జాతరకు వచ్చే భక్తులు సంతోషంతో తిరిగి వెళ్లేలా చూడాలని సూచించారు. మేడారం జాతరపై సీఎం సమీక్ష నిర్వహించారు.

cm kcr review on medaram jathara
cm kcr review on medaram jathara

By

Published : Jan 26, 2020, 5:02 PM IST

ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరకు సకల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇతర సినీయర్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అధికారుల కోసం మేడారం వెళ్లిరావడానికి ఫిబ్రవరి 5 నుంచి 9 వరకూ హైదరాబాద్‌లో రెండు హెలికాప్టర్లు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.

కేసీఆర్​కు ఆహ్వానం...

మేడారం జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​కు అందించారు. మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి మాలోత్ కవిత తదితరులు ముఖ్యమంత్రిని కలిసి మేడారం జాతరకు ఆహ్వానించారు.

మంత్రులు, అధికారులతో సమీక్ష...

అనంతరం మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులతో మేడారం జాతర ఏర్పాట్లను సీఎం సమీక్షించారు. మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో వస్తారని చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్యం తదితర విషయాల్లో ఏమాత్రం ఏమరపాటుగా ఉండొద్దని సూచించారు.

జాతరను విజయవంతం చేయాలి...

క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర అంశాల్లో సరైన వ్యూహం అనుసరించాలని సూచించారు. గతంలో వరంగల్ జిల్లాల్లో పనిచేసి, మేడారం జాతర నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అక్కడికి పంపాలని ఆదేశించారు. అన్ని శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో వ్యవహరించి జాతరను విజయవంతం చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details