రాష్ట్రంలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయని... కొవిడ్ కేసుల సంఖ్య బాగా తగ్గిందని సీఎం కేసీఆర్ అన్నారు. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పదిశాతంలోపే ఉందని.. రికవరీ రేటు 94.5 శాతం ఉందని పేర్కొన్నారు. కరోనా వచ్చిన వారు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ, మరణాల రేటు చాలా తక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని... అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రగతి భవన్లో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రిజ్వీ ఇతర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.
సెకండ్ వేవ్ వచ్చినా..
రాష్ట్ర వ్యాప్తంగా పదివేల బెడ్స్ ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయని.. ఇంకా ఎన్నయినా సిద్ధం చేయగలమని ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. దిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమ్ బంగ రాష్ట్రాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయని సీఎం అన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కొద్దిగా పెరుగుతున్నాయని దీంతో పాటు కొవిడ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. సెకండ్ వేవ్ వచ్చినా సరే తట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉండాలని.. దానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.