రాష్ట్రంలో పంటల సాగు పద్ధతిగా జరిగేలా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత కసరత్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు, నిపుణులతో మూడు రోజులుగా సీఎం సుదీర్ఘంగా చర్చించారు. వర్షాకాలం నుంచి అమల్లోకి వచ్చే నియంత్రిత సాగు విధానం... ప్రతి సీజన్లోనూ కొనసాగేలా వ్యవసాయ శాఖ అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించినప్పటికీ... పోషకాహార భద్రత సాధించనందున, ప్రజలు బలవర్థక ఆహారం తినడం లేదన్నారు. జీవన ప్రమాణాలతో పాటు రోగనిరోధక శక్తి పెరగే ఆహారాన్ని తినేలా ప్రోత్సహించడంతో పాటు అటువంటి పంటలు పండించాలని చెప్పారు.
వ్యవసాయ పరిశోధన కమిటీ..
రాష్ట్రంలో, దేశంలో ప్రజల ఆహార అలవాట్లపై ఖచ్చితమైన అంచనాలు రూపొందించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలని సీఎం తెలిపారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో పంటల సాగు జరగాలన్నారు. డిమాండ్, మార్కెటింగ్, ధరలు తదితర అంశాలపై అధ్యయనం కోసం నిపుణులు, నిష్ణాతులతో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీని ప్రభుత్వం నియమిస్తుందని వెల్లడించారు. లాభసాటి పంటలు కమిటీ సూచిస్తుందని, అందుకు అనుగుణంగా పంటలసాగు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అన్ని ఇక్కడే పండించాలి
పండ్లు, కూరగాయలను దిగుమతి చేసుకోకుండా రాష్ట్రంలోనే పండించి స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల అవసరం ఎక్కువగా ఉంటుందని... పరిసరాల్లో సాగుకు అనువైన నేలలు గుర్తించి రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆలుగడ్డ, అల్లం, ఎల్లిపాయల దిగుమతి చేసుకోకుండా రాష్ట్రంలోనే పండించాలన్న ఆయన... ఎక్కడ పండించాలి, మేలైన సాగు పద్ధతులు తదితరాలపై రైతులకు మార్గదర్శనం చేయాలన్నారు. ఉల్లిగడ్డ లభ్యత, ధరల విషయంలో ప్రతి ఏడాది అనిశ్చితి, అస్పష్టత ఎందుకు ఉండాలని ప్రశ్నించిన ముఖ్యమంత్రి... ఎప్పుడూ కొరత లేకుండా రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు ఉల్లి సాగు జరగాలని తెలిపారు.