సాగులో దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏడాదికి 35 లక్షల టన్నుల ధాన్యాన్ని సాగు చేయగా.. ప్రస్తుతం 1.10 లక్షల టన్నుల ధాన్యం పండిస్తున్నామని తెలిపారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులతో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని... బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలకు పైగా నీరు వస్తోందన్నారు. ఏటా 4 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు పండించే రాష్ట్రంగా ఎదుగుతున్నామని సీఎం పేర్కొన్నారు.
'సాగులో తెలంగాణ దేశానికే రోల్ మోడల్' - సాగు పద్ధతులపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో పంటల సాగు, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు, ప్రాంతీయ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. సాగు, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో సాగు చేయాల్సిన పంటలు, అవలంభిచాల్సిన విధానం, వాటి మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.
రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలని కేసీఆర్ సూచించారు. పంట మార్పిడితో ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయని వివరించారు. కూలీల కొరత కారణంగా సాగులో యాంత్రీకరణ పెరగాల్సి ఉందన్నారు. రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. క్లస్టర్ల వారీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల్లో పర్యటించాలన్నారు.
మార్కెట్లు కొనసాగిస్తాం...
రాష్ట్రంలో మార్కెట్లు కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు ఓ పద్ధతి ప్రకారం మార్కెట్లో అమ్ముకునే విధానం తీసుకురావాలన్నారు. ఏ గ్రామానికి చెందిన రైతులు ఎప్పుడు రావాలో టోకెన్లు జారీ చేయాలన్న సీఎం... ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉందో రైతులకు సూచనలు చేయాలన్నారు. మార్కెటింగ్ శాఖలో పరిశోధన, విశ్లేషణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కొత్త చట్టాల వల్ల మార్కెట్ సెస్ రాకున్నా... ప్రభుత్వ నిధులతో బలోపేతం చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.