తెలంగాణ

telangana

ETV Bharat / city

గ్రేటర్​ పోరు: జీహెచ్ఎంసీ ప్రజలపై సీఎం వరాల జల్లు - cm kcr release trs manifesto

గ్రేటర్‌ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్​ జీహెచ్ఎంసీ పరిధిలో నివసించేవారిపై వరాల జల్లు కురిపించారు. ఉచితంగా తాగునీటి సరఫరాకు హామీ ఇచ్చిన ఆయన.. డిసెంబర్‌ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా క్షౌరశాలలు, సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్‌లకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. సినీ రంగానికి అనేక వరాలు ప్రకటించిన ఆయన త్వరలోనే కొత్త జీహెచ్​ఎంసీ చట్టం తేనున్నట్టు వెల్లడించారు. వరదనీటి వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు.

గ్రేటర్​ పోరు: జీహెచ్ఎంసీ ప్రజలపై సీఎం వరాలు జల్లు
గ్రేటర్​ పోరు: జీహెచ్ఎంసీ ప్రజలపై సీఎం వరాలు జల్లు

By

Published : Nov 23, 2020, 7:20 PM IST

గ్రేటర్​ పోరు: జీహెచ్ఎంసీ ప్రజలపై సీఎం వరాలు జల్లు

జీహెచ్ఎంసీ ఎన్నికలకు తెరాస మేనిఫెస్టో విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గ్రేటర్‌ పరిధిలో నివసించేవారే కాకుండా..రాష్ట్ర వాసులందరిపైనా అనేక వరాలు ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి 20వేల లీటర్ల వరకు ప్రజలు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దాదాపు 97 శాతం మంది ప్రజలు ఒక్క రూపాయి కూడా నీటి బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజలు కూడా నీటి దుబారా తగ్గించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో మూసీ నదితో గోదావరిని అనుసంధానించి ప్రక్షాళన చేస్తామన్నారు. బాపుఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు మూసీ నది మధ్యలో బోటింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రాంతీయ బాహ్యవలయ రహదారి ( రీజినల్‌ రింగ్‌రోడ్డు)ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేని నగరంగా ఫుట్‌పాత్‌లు, స్కైవాక్‌లు, సైకిల్‌ ట్రాక్‌ల నిర్మాణం చేపడతామన్నారు. హైదరాబాద్‌ను జీరో కార్బన్‌ సిటీగా మార్చాలన్నదే తెరాస లక్ష్యమని కేసీఆర్‌ వెల్లడించారు. నగరం చుట్టూ మరో 3 టిమ్స్‌ ఆస్పత్రులు నెలకొల్పుతామని, బస్తీ దావాఖానాల్లో డయాగ్నస్టిక్‌ సేవలు అందుబాటులోకి తెస్తామని వివరించారు.

ధరలు సవరించుకునే అవకాశం..

రాష్ట్ర వ్యాప్తంగా లాండ్రీలు, దోబీ ఘాట్‌లకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని సీఎం ప్రకటించారు. కరోనా కాలానికి మోటారు వాహన పన్ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీలకు కనీస డిమాండ్‌ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తామన్నారు. రూ.10కోట్లలోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌ సహాయం చేస్తామని.. మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక తరహాలో టికెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు కల్పిస్తామని కేసీఆర్‌ వివరించారు. థియేటర్లను ఎప్పుడైనా తెరుచుకోవచ్చని.. ఈ విషయంలో నిర్ణయాధికారం సినీ పరిశ్రమదేనని సీఎం స్పష్టం చేశారు.

వరదనీటి నిర్వహణ ప్రణాళిక..

భవిష్యత్‌లో వరద ముప్పు లేకుండా రూ.12వేల కోట్లతో సమగ్ర వరదనీటి నిర్వహణ ప్రణాళిక అమలు చేస్తామన్న కేసీఆర్​.. రూ.13 వేల కోట్ల అంచనా వ్యయంతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక చేపట్టనున్నట్టు ప్రకటించారు.

విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్‌ మెట్రో రైలు..

మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశను విస్తరిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం, బీహెచ్‌ఈఎల్‌ నుంచి మెహదీపట్నం వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. నగరంలోని ప్రధాన కేంద్రాల నుంచి విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్‌ మెట్రో రైలు ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం త్వరలోనే కేశవాపురం జలాశయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రూ.13 వేల కోట్ల అంచనా వ్యయంతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక, రూ.12 వేల కోట్ల అంచనాతో సమగ్ర వరదనీటి నిర్వహణ ప్రాణాళిక వేస్తామని కేసీఆర్‌ అన్నారు.

కాంగ్రెస్‌, భాజపాలు విధాన నిర్ణయాల్లో పూర్తిగా విఫలమయ్యాయన్న కేసీఆర్​.. దేశానికి ప్రస్తుతం కొత్త పంథా అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి: గ్రేటర్​లో భాజపాని గెలిపిస్తే రూ. లక్ష కోట్ల ప్యాకేజి ఇస్తారా?

ABOUT THE AUTHOR

...view details