రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై వివిధ శాఖలు సమర్పించిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని మంత్రిమండలి అభిప్రాయపడింది. అన్ని విభాగాల నుంచి అయిదు రోజుల్లో పూర్తి సమాచారాన్ని సేకరించి అందజేయాలని సూచించింది. వివిధ ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో 56,979 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నివేదించాయి. ఇందులో 21,507 హోం (పోలీసు) శాఖలో కాగా 10,048 వైద్యఆరోగ్య శాఖ, 3,825 ఉన్నత విద్య, మరో 3,538 బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి. మిగిలిన శాఖల్లో 1,000 కంటే తక్కువ సంఖ్యలోనే ఖాళీన్నాయి. ఐటీ శాఖలో నాలుగంటే నాలుగు ఉద్యోగాలు మాత్రమే భర్తీ కావాల్సి ఉంది. ప్రతి విభాగంలో మంజూరైన పోస్టుల సంఖ్యను, వివిధ కేటగిరీల్లో ఉన్న ఖాళీల వివరాలను ఇచ్చారు. దీంతో పాటు వాటిల్లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వివరాలను అందజేశారు. వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు పూర్తి వివరాలు లేవని అభిప్రాయపడ్డారు. పెద్దఎత్తున ఖాళీల భర్తీ చేపడుతున్నందున సమగ్ర సమాచారం అవసరమని పేర్కొన్నారు.
ఏపీ పోస్టులను మినహాయించి..
ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లో 500 మంది ఇప్పటికే స్వరాష్ట్రానికి వచ్చారని, మరో 300 మందిని త్వరలోనే రప్పిస్తామని, వారందరిని ఖాళీల్లో నియమించాల్సి ఉన్నందున ఈ పోస్టులను ఖాళీల నుంచి మినహాయించి, మిగిలిన వాటిని మంత్రిమండలి ఉపసంఘానికి నివేదించాలని సూచించింది. దీంతో పాటు ప్రభుత్వ శాఖలు తమ ఆస్తుల వివరాలను జిల్లాలు, విభాగాలవారీగా క్రోడీకరించి అందజేయాలని సూచించింది.
విభజన ఇలా..
కొత్త జోనల్ విధానం మేరకు.. ముందుగా జిల్లా, జోన్, బహుళ జోన్ స్థాయి పోస్టులను ప్రభుత్వం నిర్ధారించాలి. ఇప్పటికే ఉద్యోగ, అధికార సంఘాలు నాలుగో తరగతి నుంచి జూనియర్ అసిస్టెంటు స్థాయి వరకు పోస్టులను జిల్లా స్థాయిగా, సీనియర్ అసిస్టెంటు స్థాయిలోని వారిని జోనల్ పోస్టులుగా, గెజిటెడ్ అధికారులను బహుళ జోన్‌గా వర్గీకరించాలని అభ్యర్థించాయి. ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనిపై ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వనుంది. ఆయా శాఖలు తమ పరిధిలో పనిచేసే వివిధ స్థాయిల ఉద్యోగుల వివరాలు అందజేశాక విభజన జరుగుతుంది.
కొత్త పోస్టులు సృష్టించాలి..
ఒకవైపు నియామక ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరోవైపు కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల విభజన జరగాలని, జిల్లాలవారీగా జోన్లవారీగా ఉద్యోగుల సంఖ్యను నిర్ధారించి, ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రిమండలి ఆదేశించింది. కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకోవాలని సూచించింది. సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన ఉండాలని, కాలం చెల్లినవాటి బదులు కొత్త పోస్టులను సృష్టించాలని నిర్ణయించింది. తద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకెళ్లేలా చర్యలకు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించింది.
ఇవీ చూడండి:తెలంగాణ స్టేట్‌ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం