తెలంగాణ

telangana

ETV Bharat / city

CM KCR On Rice crop: యాసంగిలో వరిసాగు వద్దని తేల్చిచెప్పిన సీఎం.. ఎందుకంటే.. - telangana latest news

వచ్చే యాసంగి నుంచి వరి వేయడమంటే.. రైతులు ఉరి వేసుకోవడమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం అభిప్రాయపడింది. ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమన్న కేంద్ర నిర్ణయంతో.. రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని.. రైతులు ఇకముందు వరిపంట సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని అధికారులు అభిప్రాయపడ్డారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే.. రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది.

CM KCR On Rice crop
CM KCR On Rice crop

By

Published : Sep 13, 2021, 4:57 AM IST

కేంద్ర ప్రభుత్వం ఒక్క కిలో ఉప్పుడు బియ్యం కూడా కొనలేమని తేల్చి చెప్పినందున రాష్ట్రంలోని బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని.. రైతులు ఇకముందు వరి పంట సాగు చేయడం శ్రేయస్కరం కాదని వ్యవసాయశాఖ ఉన్నత స్థాయి సమీక్షలో అభిప్రాయం వ్యక్తమైంది. కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పిన దరిమిలా, ఇక వచ్చే యాసంగి నుంచి వరి వేయడమంటే, రైతులు ఉరి వేసుకోవడమేననే ప్రగతిభవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమైందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరుసెనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది.

ప్రస్తుత వానాకాలంలో 60 లక్షల టన్నులకు మించి ధాన్యం తీసుకోబోమని కేంద్రం నిర్మొహమాటంగా చెప్పినందున, ధాన్యాన్ని ప్రభుత్వం గానీ, మిల్లర్లు గానీ కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రానున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులు మాట్లాడారు.

‘‘తెలంగాణలో గత యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా త్వరగా తీసుకుంటే వానాకాలంలో ఉత్పత్తయ్యే పంట నిల్వకు సరిపడా స్థలం లభిస్తుందని పేర్కొంటూ, ఇటీవల రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్‌, కేటీఆర్‌లు కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలసి విన్నవించారు. ఇప్పటికే కేంద్రం వద్ద అయిదేళ్లకు సరిపడా నిల్వలున్నాయని, కొత్తగా కిలో కూడా కొనలేమని ఆయన తేల్చిచెప్పారు. దేశంలో కరవు, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని ప్రజావసరాల దృష్ట్యా ధాన్యం నిల్వ చేయడం కేంద్ర ప్రభుత్వ విధి, రాష్ట్రాలు తమకు పంటలను కనీస మద్దతు ధర ద్వారా కొనుగోలు చేసి ఇవ్వడం వరకే రాష్ట్రాల బాధ్యత. కేంద్ర మంత్రి గోయల్‌ మాత్రం ఇప్పటికే నిల్వలు ఉన్న దృష్ట్యా కొత్తగా కొనేది లేదంటున్నారు’’ అని వారు పేర్కొన్నారు.

ఇకపై కష్టమే

‘‘గత యాసంగిలో రాష్ట్రం 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. రైతులు ఈ వానాకాలంలో 55 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. దీనిద్వారా సుమారు 1.40 కోట్ల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే సుమారు 70 లక్షల టన్నుల ధాన్యం ఇంకా రాష్ట్ర రైస్‌ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో నిల్వ ఉంది. వీటి దృష్ట్యా పీడీఎస్‌ తదితర అవసరాల మేరకు, కేంద్రం నిర్ధారించిన కోటా మినహా, మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ విధానాల దృష్ట్యా సాధ్యం కాకపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంపై గత యాసంగిలో సేకరించిన ధాన్యం వల్ల సుమారు రూ.2,000 కోట్ల అదనపు భారం పడనుంది. కరోనా వల్ల రైతులు నష్టపోరాదని గతంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి ధాన్యం కొనుగోలు చేసింది. కానీ, ఈ వర్షాకాలంలో కేంద్రం నిర్ధారించిన 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లను ఐకేపీ కేంద్రాల ద్వారా కోటా మేరకు మాత్రమే ధాన్యం సేకరణ జరగాలి. రైతులను చైతన్య పరిచేందుకు వ్యవసాయశాఖ అన్ని స్థాయిల్లోని అధికారులు తగు ప్రచారం నిర్వహించాలి’’ అని సమావేశం అభిప్రాయపడింది.

ఇవీ చూడండి:పంచాయతీరాజ్‌లో డిప్యూటేషన్ల పర్వం... ప్రజలకు కష్టం

ABOUT THE AUTHOR

...view details