CM KCR Meet Sharad Pawar: కేంద్రంలోని భాజపా విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఆరంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఎన్సీపీ అధినేత నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించిన అంనతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
దేశానికి కొత్త విజన్, సరైన అజెండా అవసరం: కేసీఆర్ శరద్ పవార్‌తో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం సాగిందని.. మొదట్నుంచి శరద్ పవార్ తెలంగాణకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రావాల్సిన మార్పుల గురించి చర్చించినట్లు సీఎం తెలిపారు.
దేశాభివృద్ధికి కావాల్సిన కొత్త కార్యాచరణపై చర్చించినట్లు కేసీఆర్ వివరించారు. దేశానికి కొత్త విజన్, సరైన అజెండా అవసరం అని అన్నారు. అనుభవజ్ఞుడైన శరద్ పవార్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. త్వరలో మరికొందరు నేతలతో సమావేశమై చర్చిస్తామని పేర్కొన్నారు. అందరం చర్చించి అజెండా రూపొందించుకొని ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ముంబయిలో పర్యటన ముగిసింది. శరద్ పవార్ నివాసం నుంచి విమానాశ్రయానికి బయల్దేరారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి :ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిది: కేసీఆర్