KCR Meet Tikait: రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ సింఘ్ టికాయత్ తెలిపారు. దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ సింఘ్ టికాయత్‌తో భేటీ అయ్యారు. దిల్లీలోని తన నివాసానికి ఇద్దరు నేతలను సీఎం కేసీఆర్.. లంచ్‌కు ఆహ్వానించారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్.. టికాయత్‌తో సుమారు 2 గంటలపాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
ఫ్రంట్ గురించి చర్చించలేదు..
Rakesh tikait Comments: తెలంగాణలో సాగు అనుకూల విధానాలు అమలవుతున్నాయని టికాయత్ తెలిపారు. రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు అమలు చేస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు భరోసాగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు ప్రత్యామ్యాయ విధానాలు తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగానే సీఎం కేసీఆర్‌ను కలిశానన్నారు. తమది రాజకీయాలతో సంబంధం లేని సంస్థ అని పేర్కొన్న టికాయత్.. ఫ్రంట్ గురించి చర్చించలేదన్నారు.
"ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా రైతుల కోసం నూతన విధానం రావాలి. ప్రత్యామ్నాయ విధానాల కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా. ప్రత్యామ్నాయ విధానంలో భాగంగానే కేసీఆర్‌ను కలిశా. రానున్న రోజుల్లో పార్టీలకతీతంగా సీఎంలందరినీ కలుస్తా. ఉద్యమంలో చనిపోయిన రైతుల వివరాలు త్వరలో కేసీఆర్‌కు ఇస్తాం. అమరులైన రైతుల కుటుంబాలకు కేసీఆర్ పరిహారం అందిస్తారు. వ్యవసాయ రంగం, రైతాంగం కోసం హైదరాబాద్ గాని మరో చోట కానీ ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తాం. కేసీఆర్ ఫ్రంట్ గురించి ఆయనతో చర్చించలేదు.. మేము రైతు ఉద్యమ నేతలం. మాది రాజకీయాలతో సంబంధం లేని సంస్థ."- రాకేష్ టికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి