CM KCR meeting: యాసంగిలో పంటల సాగు, దళితబంధు అమలు, ఉద్యోగ విభజన, కల్పన లాంటి అంశాలే ప్రధాన ఎజెండాగా సాగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో నిర్వహించిన సమావేశంలో.. మంత్రులు, సీనియర్ అధికారులు, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
అర్థమయ్యేలా చెప్పాలి..
యాసంగిలో కిలో వడ్లు కూడా కొనేది లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేది లేదని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. యాసంగి వరిధాన్యం కొనబోమని కేంద్రం పదేపదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయాన్ని వివరించాలని కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
"గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదు. వీటిని ఇకముందు కూడా కొనసాగిస్తాం. యాసంగిలో కేంద్రం వడ్లు కొనటం లేదు. కాబట్టి యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్ర వైఖరిని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి.ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల సాగుదిశగా రైతులను సమాయత్తం చేయాలి.రైతుల్లో అవగాహన పెంచే బాధ్యత అధికారులు తీసుకోవాలి. వచ్చే వానాకాలం పంటలపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలి. వానాకాలంలో ప్రధానంగా పత్తి, వరి, కంది సాగుపై దృష్టిపెట్టాలి." - కేసీఆర్, సీఎం
ముందు చెప్పినట్టే అమలు చేస్తాం..
ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని... అందుకు అవసరమైన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే పథకం లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు.
"దళితబంధు పథకం ద్వారా పూర్తి రాయితీతో అందించే పది లక్షల రూపాయలు... దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తాయి. సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంలో దళితబంధు దోహద పడుతుంది. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళితబంధును.. ముందు ప్రకటించిన విధంగా అమలు చేస్తాం. ఎప్పుడు మోసానికి గురవుతున్న వారి ఆర్తిని అర్థం చేసుకొని పని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు చేసిన ఏ పనిలో లేని తృప్తి దళితబంధు పథకం అమల్లో లభిస్తుంది. దళిత కుటుంబాల ఆర్థికస్థితిని మెరుగు పరిచేందుకు ఉన్న అన్ని అవకాశాలు, వ్యాపార, ఉపాధి మార్గాలను శోధించాలి. అందుకోసం దళితమేధావులు, విశ్రాంత ఉద్యోగులు, తదితరుల సలహాలు సూచనలు తీసుకోవాలి." - సీఎం కేసీఆర్
అప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యం..
ఉద్యోగుల విభజనపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ పలు ఆదేశాలు ఇచ్చారు. కొత్త జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల విభజన ఉండాలని సూచించారు. స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన జరగాలన్నారు. 5 రోజుల్లో ఉద్యోగుల విభజన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు.
"కొత్త జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల విభజన జరగాలి. స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన జరగాలి. కొత్త జోనల్ వ్యవస్థతో పాలన క్షేత్రస్థాయిలో అమలవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లాలి. ఉద్యోగులు మారుమూల గ్రామాల్లోకి వెళ్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. 5 రోజుల్లో ఉద్యోగుల విభజన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలి. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలి. స్థానికులకు నష్టం జరగకుండా ఉద్యోగుల విభజన జరగాలి." - కేసీఆర్, సీఎం
ఇదీ చూడండి: