భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. పోలీసు వ్యవస్థ నవీకరణకు, వెనకబడిన జిల్లాలకు నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రాత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాత్రి 8 గంటలకు ఆయన ఇంటికి చేరుకున్న కేసీఆర్ సుమారు 40 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇటీవల వరదలు, భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వ నివేదికను ఆయనకు అందించినట్లు తెలిసింది. విపత్తు నిర్వహణ నిధుల విడుదలపై చర్చించారని, వరద సాయం కోసం ప్రధానమంత్రికి అక్టోబరు 15న లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారని తెరాస వర్గాలు తెలిపాయి. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.650 కోట్ల మేరకు సాయం అందించినట్టు వివరించారని పేర్కొన్నాయి.
సాయం అందించండి
‘‘వరదల వల్ల తెలంగాణకు రూ.5 వేల కోట్లకుపైగా నష్టం జరిగింది. హైదరాబాద్ అతలాకుతలమయింది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువు కట్టలు తెగడం, బుంగలు పడడం వల్ల జల వనరుల శాఖకు రూ.50 కోట్ల వరకు నష్టం జరిగింది. పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.295 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.184 కోట్లు, జాతీయ రహదారుల పరిధిలో రూ.11 కోట్ల మేర నష్టం వాటిల్లింది. హైదరాబాద్‌లో బాధితులను, తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు, పునరుద్ధరణ చర్యలకు ఆర్థిక సహాయం అందించండి. అలాగే బీఆర్‌జీఎఫ్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నాయి. పోలీసు వ్యవస్థను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. దేశంలోనే అతిపెద్దదైన పోలీసు కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రం నుంచి సాయం అందించండి’’ అని సీఎం కోరారని తెలిసింది.
వీటితో పాటు రాజకీయ పరిణామాల గురించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
సీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ప్రయోజనాలకు భంగం
హోంమంత్రితో భేటీకి ముందు కేసీఆర్ జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. సాయంత్రం 6.05 గంటలకు మంత్రి నివాసానికి చేరుకున్న సీఎం సుమారు గంటపాటు సమావేశమయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లే తీరును వివరించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మూడో టీఎంసీకి అనుమతులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. నదుల అనుసంధానానికి సంబంధించి తన అభిప్రాయాలను కేంద్ర మంత్రికి తెలియజేసినట్లు తెలిసింది.
రాష్ట్ర నాయకులు సీఎం నివాసంలోనే
హైదరాబాద్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. అమిత్ షా, షెకావత్‌లతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే భేటీ అయ్యారు. షెకావత్‌తో భేటీ సమయంలో జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం తొలి 15 నిమిషాలు ఉన్నారు. తాను కేంద్ర మంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడతానని ముఖ్యమంత్రి అనడంతో శ్రీరాం సమావేశం నుంచి బయటకు వచ్చారు. పార్టీ ఎంపీలు, అధికారులు ఎవరూ ఆయా సమావేశాలకు హాజరు కాలేదు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ వెంట రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ వచ్చినా వారిద్దరూ ముఖ్యమంత్రి నివాసంలోనే ఉండిపోయారు. కేంద్ర మంత్రుల నివాసాలకు సీఎం వెంట రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, సీఎం వ్యక్తిగత సహాయకుడు వచ్చినా వారిద్దరూ బయటే ఉండిపోయారు.
నేడు ప్రధాని, కేంద్ర మంత్రులతో సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీతో కేసీఆర్ ఇవాళ సమావేశం కానున్నట్లు తెలిసింది. విభజన హామీలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానమంత్రితో చర్చిస్తారని సమాచారం. సిద్దిపేటకు త్వరలోనే అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించినందున ఆ అంశంపై పౌర విమానయాన శాఖ మంత్రితోనూ, జాతీయ రహదారులకు నిధుల మంజూరుపై గడ్కరీతోనూ చర్చించనున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి :కేంద్ర జల్‌శక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ