ఈనెల 18, 19 తేదీల్లో జరిగే తెలంగాణ శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాల్లో కొత్త పురపాలక చట్టంపై బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు వాటిపై వివరణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సన్నద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. పురపాలక సంస్కరణలో భాగంగా కొత్త చట్టం అవసరం ఉందని భావించిన కేసీఆర్ అన్నీ తానై దీనిని తయారు చేయించారు. న్యాయశాఖ ఆమోదం లభించింది. మంగళవారం బిల్లును ముద్రించే ప్రక్రియ జరగనుంది. ఆ తర్వాత వాటిని శాసనసభకు తరలిస్తారు.
19న చర్చ
ప్రస్తుతం పురపాలక శాఖను సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్నారు. ఈనెల 18న అసెంబ్లీలో కొత్త పురపాలక చట్టంపై బిల్లును ముఖ్యమంత్రి ప్రవేశపెడతారు. ఆ తర్వాత సమావేశాలు వాయిదా పడతాయి. 19న ఉదయం దీనిపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఈ చట్టం లక్ష్యాలను సీఎం వివరించడంతో పాటు విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు శాసనమండలిలోనూ ముఖ్యమంత్రే బిల్లును ప్రవేశపెడతారు.