రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు ప్రారంభమైంది. కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధులపై స్పష్టత వచ్చింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా తగ్గింది. ఇతర కేటాయింపుల్లోనూ నిధులు తగ్గనున్నాయి. వివిధ రాయితీలను కేంద్రం తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నిధులు వచ్చే ఏడాది పూర్తిగా వచ్చే అవకాశం లేదు. ఈ ఏడాది రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు వచ్చాయి. ఐజీఎస్టీ సెటిల్మెంట్ కింద సైతం నిధులు వచ్చాయి.
ఆర్థిక సంఘం సిఫార్సులపై..
కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో రుణపరిమితిని కేంద్రం ఐదు శాతం వరకు అనుమతిచ్చింది. దీంతో ఆదాయం తగ్గినప్పటికీ... ఈ ఏడాది ఎక్కువ మొత్తం అప్పులు తీసుకునే వెసులుబాటు కలిగింది. 2021-22లో రుణపరిమితిని జీఎస్డీపీపై 4 శాతానికి మాత్రమే అనుమతించింది. జీఎస్డీపీ కూడా ఈ ఏడాది తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక సంఘం సైతం జీఎస్డీపీ తగ్గుతుందని అంచనా వేసింది. జీఎస్డీపీలో తగ్గుదల, దానిపై నాలుగు శాతం రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత ఏడాది తీసుకున్న రుణాల కంటే వచ్చే ఏడాది తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధులు కూడా పూర్తిగా రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. ఈ అంశాలన్నింటినీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2021-22లో ఆదాయం అంచనాలకు సంబంధించి సీఎం ఆరా తీశారు.