తెలంగాణ

telangana

ETV Bharat / city

CM KCR: పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో సర్కారు కృషి - telangana Diagnostic Centers

cm kcr Inauguration of Diagnostic Centers on the 7th of this month
cm kcr Inauguration of Diagnostic Centers on the 7th of this month

By

Published : Jun 5, 2021, 2:49 PM IST

Updated : Jun 5, 2021, 8:13 PM IST

14:47 June 05

CM KCR: ఈ నెల 7న 19 డయాగ్నొస్టిక్ కేంద్రాల ప్రారంభోత్సవం

ఈ నెల 7న 19 డయాగ్నొస్టిక్ కేంద్రాల ప్రారంభోత్సవం

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పునకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లో ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో... 19 వైద్య పరీక్ష కేంద్రాలు జూన్ 7న ప్రారంభించాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్ జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్న డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని... అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుసహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచామని తెలిపారు.

త్వరలోనే మంచి పేరు...

కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స కోసం అవసరమైన ఇతర పరీక్షలకు కూడా పేదలు నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో వైద్యం అందిచడమంటే కేవలం వైద్యులు, మందులు, సూదులు మాత్రమే కాదనీ...  పరీక్షలు కూడా అత్యంత ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వం భావించింది. ఈ మేరకు తక్షణం 19 జిల్లాల్లో డయాగ్నోసిస్ కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇంకా అవసరమైన చోట్ల దశల వారీగా డయాగ్నోసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇటువంటి ఏర్పాటు ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మకమైంది. పేదల ఆరోగ్యం పట్ల సర్కారు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చక్కటి సమన్వయం చేసుకుని తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా మహమ్మారి వంటి ఆపత్కాలంలో ప్రభుత్వం వినియోగంలోకి తెస్తున్న ఈ డయాగ్నోసిస్ సేవలు ప్రజలకెంతో మేలు చేస్తాయని... ఈ పథకానికి త్వరలోనే ఓ మంచి పేరుపెడతామని ప్రకటించారు. మండల కేంద్రాల్లో పీహెచ్‌సీల్లో చికిత్స చేయించుకున్న రోగికి స్వయంగా ఈ డయాగ్నోసిస్ కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితులుంటాయి. సంబంధిత వైద్యుని సిఫారసు మేరకు రోగ నిర్ధరణ పరీక్షల కోసం పరీక్షా నమూనాలు ప్రభుత్వమే దగ్గరలో ఉన్న కేంద్రానికి పంపి పరీక్షలు నిర్వహించి సత్వరమే రిపోర్టులు ఇచ్చేలా  సోమవారం నుంచి ప్రారంభించనున్న డయాగ్నోసిస్ కేంద్రాల్లో... పేదల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయనుందని సీఎం తెలిపారు.

ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో

ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోసిస్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా పరీక్షలతో పాటుగా... రక్త పరీక్ష, మూత్ర పరీక్షసహా రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్‌రేలు, బయోకెమిస్ట్రీ పాథాలజీ సంబంధించి పలు పరీక్షలు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. సాధారణ పరీక్షలే కాకుండా అత్యంత అరుదుగా చేసే ఖరీదైన ప్రత్యేక పరీక్షలు కూడా పూర్తి ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులు ఇస్తారని చెప్పారు. నిర్ధరించిన రిపోర్టులు ఆయా రోగుల మొబైల్‌ ఫోన్లకు ఎస్‌ఎంస్‌ల రూపంలో పంపించే ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందన్నారు. ఈ కేంద్రాల్లో పరీక్షల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పరీక్షా యంత్రాలన్నీ అత్యంత అధునిక సాంకేతికత, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో కూడిన ఖరీదైన యంత్రాలని చెప్పారు. ఇలాంటి పరీక్షా యంత్రాలు పెద్ద పెద్ద కార్పొరేట్ దవాఖానాల్లో... గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ దవాఖానాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఏర్పాటు చేసిందని సీఎం స్పష్టం చేశారు.

అత్యంత సామర్థ్యం.. శరవేగంగా రిపోర్టులు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాగ్నసిస్ కేంద్రాల్లో... "ఫుల్లీ ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్", "ఫుల్లీ ఆటోమేటిక్ ఇమ్యునో అస్సే అనలైజర్", "ఫైవ్ పార్ట్స్ సెల్ కౌంటర్", "ఎలీసా రీడర్ అండ్ వాషర్", "ఫుల్లీ ఆటోమేటిక్ యూరిన్ అనలైజర్" వంటి అత్యాధునిక సాంకేతికతో కూడిన రోగ నిర్ధరణ పరీక్షా యంత్రాలున్నాయని వివరించారు. వీటితోపాటు ఈసీజీ, టుడీ ఈకో, ఆల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్​రే వంటి ఇమేజింగ్ పరీక్షా యంత్రాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇవి అత్యంత సామర్థ్యంతో కూడుకుని శరవేగంగా రిపోర్టులు అందిస్తాయని చెప్పారు. పరీక్షల తీరు అనుసరించి ఒక్కో యంత్రం గంటకు 400 నుంచి 800 రిపోర్టులు కచ్చితత్వంతో అందచేస్తాయని తనకు వైద్యాధికారులు తెలిపారని సీఎం అన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ఏర్పాటైన అత్యాధునిక యంత్రాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మంది పేదలకు రోగ నిర్ధారణలు చేసి వైద్య సేవలందించగలుగుతామని తెలిపారు. వీటితోపాటు అందుబాటులో లేనిచోట్ల సీటీ స్కానింగ్ యంత్రాలు కూడా దశల వారీగా ఏర్పాటు చేస్తామన్న సీఎం... ఈ పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మేరకు పాథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, రేడియాలజిస్టులుసహా పరీక్షలు నిర్వహణకు అర్హులైన సాంకేతిక సిబ్బందిని ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని స్పష్టం చేశారు.  

ఖర్చులన్నీ ప్రభుత్వానివే...

"సాధారణంగా వైద్య అవసరాల కోసం నాలుగు రకాల ఖర్చులుంటాయి. దవాఖానాకు వెళ్లడానికి రవాణా ఖర్చు, డాక్టర్ ఫీజు, మందులు, పరీక్షల ఖర్చు, ఇన్ పేషెంట్‌గా చేరాలంటే కావాలంటే చికిత్స ఖర్చు, రోగం నయమయ్యాక తిరిగి ఇంటికి వెళ్లాలంటే మళ్లీ రవాణా ఖర్చు...  ఒకవేళ చనిపోతే వారి పార్థీవదేహం తరలించడానికి అదో ఖర్చు... ఈ ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తూ సర్కారు దవాఖానాల్లో పూర్తి ఉచితంగా సామాన్యులకు వైద్య సేవలు అందిస్తున్నాం. అత్యవసర సమయాల్లో దవాఖానాకు తీసుకువెళ్లడానికి 108 అంబులెన్సులు... 428 నిరంతరం నడుపుతున్నాం. బాలింతలు, తల్లీ బిడ్డల రక్షణ రవాణా కోసం అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటికే 300 వాహనాలను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నాం. బాలింతలను దవాఖానాలో చేర్చడం నుంచి తిరిగి ప్రసవానంతరం కూడా తల్లీ బిడ్డలను ఇంటి వద్దకు సురక్షితంగా చేర్చే వరకు అమ్మఒడి వాహనాలు అందుబాటులో ఉంటున్నాయి."- సీఎం కేసీఆర్​.

ఇవీ చూడండి: 

Audio viral: జీజీహెచ్​లో డాక్టర్ కాముడు.. ఆడియో వైరల్‌!

Corona Death: ఒకరి తర్వాత ఒకరు.. ఒకేరోజు ముగ్గురు మృతి

Last Updated : Jun 5, 2021, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details