T HUB 2.0: అద్భుత నగరమైన హైదరాబాద్ ప్రపంచ అంకురాల రాజధానిగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ టీహబ్ దేశానికి తలమానికంగా, ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రతిభావంతులైన యువ ఆవిష్కర్తలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాంకేతిక కేంద్రాన్ని స్థాపించి.. దేశంలో తెలంగాణ తొలి అంకుర రాష్ట్రంగా ఆవిర్భవించిందని, ప్రపంచంతో పోటీపడుతూ గొప్ప ప్రగతిని సాధించిందని ఆయన వివరించారు. ‘‘ఆలోచనతో రండి- ఆవిష్కరణలతో వెళ్లండి’’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టీహబ్-2 ఆవిష్కరణల ప్రాంగణం భారత చరిత్రలో మైలురాయి అని, అత్యుత్తమ సౌకర్యాలతో ప్రపంచ ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుందని చెప్పారు. దేశ భవిష్యత్తుకు ఇది మార్గదర్శకమవుతుందని, యువభారత్‌ను ప్రపంచపటంలో ప్రముఖంగా నిలుపుతుందని, వారి అంకుర, సాంకేతిక సామర్థ్యాలను చాటుతుందన్నారు. టీహబ్-2ను దేశంలోని యువ భారతీయులకు అంకితం చేస్తున్నామని తెలిపారు. యువతకు, పారిశ్రామికవేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.
భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన మూలస్తంభాలుగా నిలిచే కొత్తతరం అంకురాలను పెంచడం.. రాష్ట్రానికి, దేశానికి ప్రపంచ గుర్తింపును తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో సులభతర వ్యాపార నిర్వహణలో అంకురాలకు అండగా నిలుస్తామని, వారికి మరింత చేయూత అందిస్తామని, కొత్త ఆలోచనతో అంకురాలను స్థాపించేందుకు ముందుకొస్తే టీహబ్-2 ద్వారా సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. అంకుర ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్-2ను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘టీహబ్ తెలంగాణకు గర్వకారణం. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నిరంతరంగా ఆవిష్కరణలు, అంకురాలను పెద్దఎత్తున ప్రోత్సహించాలనే నిర్ణయం మేరకు 2015లో టీహబ్‌ను ప్రారంభించాం. అంకురాలను ప్రభుత్వమే ప్రోత్సహించే విధానం తెలంగాణలోనే మొదటిసారిగా ప్రారంభమైంది.
75వ స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్నిరోజుల ముందు టీహబ్ విస్తరించడం తెలంగాణ సాంకేతిక, పారిశ్రామిక ప్రగతికి నిదర్శనం. అంకురాలు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తాయి. వాటి ద్వారా అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర అంకురాల విధానం ప్రగతిశీలమైంది. కార్పొరేట్, విద్యాసంస్థలతో ఫలవంతమైన భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంది. అందరూ కలిసి పనిచేయడానికి, ఒకరికొకరు సహాయపడడానికి ఇది సహకరిస్తుంది. టీహబ్‌తో పాటు టీఎస్‌ఐసీ, రిచ్, టీవర్క్స్, టాస్క్, టీఫైబర్ వంటి సంస్థలు రాష్ట్ర ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యున్నత పర్యావరణ వ్యవస్థతో అత్యుత్తమ ప్రతిభను వెలుగులోకి తెస్తున్నాయి.
మొదటి దశ స్ఫూర్తితో...
కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపం టీహబ్. దీంతో తెలంగాణ కన్న కలలు నెరవేరుతున్నాయి. మొదటి దశలో 2వేల అంకురాలకు రూ.9,399 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, ఏంజెల్ ఇన్వెస్టర్‌లతో అనుసంధానం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి మన అంకురాలు విస్తరించాయి. మొదటి దశ స్ఫూర్తితో దేశ యువతను మరింత ప్రోత్సహించేందుకు, మరింత మద్దతు అందించేందుకు ప్రపంచస్థాయి ఇంక్యుబేషన్ కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మొదటి దశ కంటే రెండో దశ అయిదురెట్లు పెద్దది. ఆవిష్కరణల అనుసంధానకర్తగా, దేశ ఆవిష్కరణలు, పారిశ్రామికత స్వరూపాన్ని విప్లవాత్మకంగా మార్చే దిశగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ప్రపంచంలోని ఇలాంటి పది వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. నిధుల సమీకరణలో ఆసియాలోని మొదటి 15 స్థానాల్లో ఒకటిగా ఉంది. దేశంలోని అత్యుత్తమ జీవన ప్రమాణ నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. సాంకేతికత సాయంతో టీఎస్‌ఐపాస్, టీఎస్‌బీపాస్ వంటి పథకాలు పాలనపరంగా గుర్తింపు పొందడంతో పాటు ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నాయి.
2021లో తెలంగాణలోని అంకురాల విలువ రూ.37 వేల కోట్లుగా ఉంది. ఇది మరింత పెరుగుతుంది. మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకటనరసింహారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, బృందం అపూర్వ కృషితోనే టీహబ్ వంటి విజయవంతమైన ప్రాజెక్టులతో పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. పారిశ్రామిక, ఆవిష్కరణల, సాంకేతిక రంగం బలోపేతానికి కొత్త ప్రతిపాదనలు వస్తే వాటిని చేపడతాం. భవిష్యత్తులో హైదరాబాద్‌లో ఐటీ రంగంలో పురోగతి మరింతగా పెరుగుతుంది. దానికనుగుణంగా మౌలిక వసతులను పెంచేందుకు అధికారులు దృష్టి సారించాలి’’ అని అన్నారు. ఈ సందర్భంగా అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఆవిష్కరణ జ్యోతిని సీఎం కేసీఆర్‌కు అందజేశారు.పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ ఎనిమిదేళ్ల కల ఇప్పటికి సాకారమైందని తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపంగా టీహబ్ ఆరంభించిన కొద్ది కాలంలోనే ప్రపంచ గుర్తింపు పొందిందని, ఆ తర్వాత డిమాండ్ పెరగడంతో రెండో దశ చేపట్టామని, ప్రారంభానికి ముందే దానికి విశేష ఆదరణ లభించిందన్నారు. టీహబ్ సీఈవో శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ టీహబ్‌తో పలు రాష్ట్రాలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయని, పలు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయన్నారు. టీహబ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీహబ్ ఆధునిక సాంకేతిక విప్లవమని, దేశానికి గొప్ప మార్గాన్ని చూపిందని చెప్పారు.