తెలంగాణ

telangana

ETV Bharat / city

రేపు, ఎల్లుండి ఇంజినీరింగ్ విభాగాల ముఖ్యులతో సీఎం కేసీఆర్ సమీక్ష

ఇంజినీరింగ్​ విభాగాల ముఖ్యులతో రేపు, ఎల్లుండి సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. నీటిపారుదలశాఖ పునర్​ వ్యవస్థీకరణ ముసాయిదాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం సచివాలయ భవన సముదాయం నిర్మాణంపై సమీక్షించనున్నారు.

cm kcr
cm kcr

By

Published : Jul 19, 2020, 1:13 PM IST

Updated : Jul 19, 2020, 2:08 PM IST

నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ, కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు, ఎల్లుండి సమీక్ష నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నీటిపారుదల శాఖపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. సంబంధిత ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సమీక్షలో పాల్గొంటారు. రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఆ శాఖను పునర్వ్యవస్థీకరించి, బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ప్రస్తుతం చిలువలు, పలువలుగా భారీ, మధ్యతరహా, చిన్న తరహా, ఐడీసీ, ప్రాజెక్టులు, ప్యాకేజీల పేరుతో ఉన్న సాగునీటిశాఖను ఇదంతా ఒకే గొడుకు కిందికి తీసుకురావాలని నిర్ణయించారు.

ముసాయిదాపై సమగ్ర చర్చ

పటిష్ఠ పర్యవేక్షణ కోసం నీటి పారుదల శాఖను చీఫ్ ఇంజినీర్ల నేతృత్వంలో 15-20 ప్రాధేశిక విభాగాలుగా విభజించాలని నిర్ణయించారు. ఆ ప్రాజెక్టులు, జలాశయాలు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యామలన్నీ సంబంధిత సీఈ పరిధిలోనే ఉండాలని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణపై వర్క్ షాపు నిర్వహించి ముసాయిదా రూపొందించారు. ఈ ముసాయిదాపై రేపటి సమీక్షలో సర్వ సమగ్ర చర్చ జరిపి, తుది నిర్ణయం తీసుకుంటారు.

సచివాలయంపై చర్చ

సచివాలయ నూతన భవన సముదాయం నిర్మాణంపై మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం తెలంగాణ ప్రతిష్ఠ, వైభవానికి ప్రతీకగా ఉండాలని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. సంబంధించిన డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి... మంగళవారం నాటి సమీక్షలో వాటిపై చర్చిస్తారు. సచివాలయ బాహ్యరూపం, లోపల సౌకర్యాలు తదితర అంశాలపై చర్చిస్తారు. అనంతరం వాటిని మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి, భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. ఆర్ అండ్ బీ సమీక్షలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి, ఇంజినీరింగ్ అధికారులతో పాటు తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్, పొన్ని తదితరులు పాల్గొంటారు.

Last Updated : Jul 19, 2020, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details