తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో నూతన శకం ప్రారంభమవుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శతాబ్దాలనాటి చట్టాల బూజు దులుపుతూ... అవినీతిరహిత వ్యవస్థే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని తెలిపారు. అన్ని కోణాల్లో ఆలోచించి... రాష్ట్రంలోని అన్ని వర్గాలను, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రెవెన్యూ చట్టానికి రూపకల్పనచేసిందని ట్వీట్ చేశారు.
రైతుల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా రెవెన్యూలో భారీ సంస్కరణలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని మంత్రి అన్నారు. ఐదేళ్ల కోసం వచ్చే ఎన్నికల రాజకీయాలను పక్కనపెట్టి భవిష్యత్తు తరాల కోసం నూతన చట్టాలను సీఎం కేసీఆర్ రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. దశాబ్దాల బూజుపట్టిన చట్టాలను తిరగరాసి పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తూ అవినీతిరహిత వ్యవస్థ కోసం నడుంకట్టి జనరంజక పాలనతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. సామాన్యుడి మెడకు పాశంగా మారుతున్న ఒక్కో చిక్కుముడిని ప్రభుత్వం విప్పుతోందని స్పష్టం చేశారు.