నియంత్రిత సాగుతోనే లాభాల పంట నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానంపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. జిల్లా అధికారులు, రైతుబంధు సమితి అధ్యక్షులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం అభిప్రాయాలు తెలుసుకున్నారు. రైతులంతా ఒకే పంట వేయడం ద్వారా డిమాండ్ పడిపోయి నష్టపోతున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. అలా జరగకుండా ఉండేందుకు నియంత్రిత పద్ధతిలో సాగు చేయాలని ప్రభుత్వం అఖిలషిస్తోందని తెలిపారు. ఏ సీజన్లో ఏ పంటలు వేయాలి? ఎక్కడ ఎలా సాగు చేయాలనే విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారని వివరించారు. ఏ పంటకు మార్కెట్‌లో డిమాండ్ ఉందో ఆగ్రో బిజినెస్ విభాగం తేల్చిందని తెలిపారు.
ఏ పంటలు వేయాలి?
రాష్ట్రంలో గత ఏడాది వానాకాలంలో మాదిరిగానే వరిని 40 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 53 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పత్తిని 70 లక్షల ఎకరాలకు పెంచాలని తెలిపారు. గతంలో ఏడు లక్షల ఎకరాల్లో కందివేయగా ఇప్పుడు 15 లక్షల ఎకరాల్లో వేయాలని.. సోయాచిక్కుడు, పసుపు, మిర్చి, కూర గాయలు తదితర పంటలు గత ఏడాది మాదిరిగానే వేసుకోవచ్చని తెలిపారు. వివిధ రకాల విత్తనోత్పత్తి చేసే రైతులు యథావిధిగా చేసుకోవచ్చని, పచ్చిరొట్టను విరివిగా సాగు చేయాలని సూచించారు. వానాకాలంలో మక్కల సాగు లాభసాటి కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఇందుకు బదులుగా పత్తి, కంది తదితర పంటలు వేసుకోవాలని తెలిపారు. వరి వంగడాల్లో మంచి డిమాండ్ ఉన్న తెలంగాణ సోనాను పండించాలని సూచించారు. 6.5 మిల్లీమీటర్ల సైజు కలిగిన బియ్యం రకాలకు అంతర్జాతీయ మార్కెట్ ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
చొరవ చూపాలి..
గోదావరి ప్రాజెక్టుల కింద సత్వరం నీరు వచ్చే ప్రాంతంలో దీర్ఘకాలిక, కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో ఆలస్యంగా నీరొచ్చే చోట్ల స్వల్పకాలిక వరి రకాలు వేసుకోవాలని సీఎం సూచించారు. కంది పంట వేస్తే మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. పత్తి ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో జిన్నింగ్ మిల్లులు లేకపోతే ఏర్పాటుకు పరిశ్రమల శాఖ చొరవ చూపాలని ఆదేశించారు. ఈ వానాకాలం నుంచే ఏ కుంటలో ఏ పంట వేస్తున్నారో? వ్యవసాయ విస్తరణాధికారులు కచ్చితమైన వివరాలు సేకరించి సాగు విస్తీర్ణం లెక్కించాలన్నారు. త్వరలో వ్యవసాయ ఉత్ప త్తుల మార్కెటింగ్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కమిటీలను నియమిస్తామని ప్రకటించారు. పెద్ద ఎత్తున ఆహార శుద్ధి యూనిట్లు, సెజ్‌లు ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించారు. సెజ్‌ల పక్కనే గోదాముల నిర్మించాలని.. ఈ ప్రాంతంలో ఇళ్ల లేఅవుట్‌కు అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన 125 మండలాల్లో గోదాములు రావాలన్న సీఎం.. ప్రతి గోదాములో కొంత శీతలగిడ్డంగి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని 2,602 క్లస్టర్లలో..
తన వ్యవసాయ భూమి ఉన్న ఎర్రవెల్లిలో సొంత ఖర్చుతో రైతు వేదిక నిర్మిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని రైతుబంధు అద్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థచైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొందరు జిల్లా రైతుబంధు అధ్యక్షులు వారి వారి ప్రాంతాల్లో రైతు వేదికల నిర్మాణానికి ముందుకొచ్చారు. రాష్ట్రంలోని 2,602 క్లస్టర్లలో నాలుగైదు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 25లోగా ఖాళీగా ఉన్న వ్యవ సాయ విస్తరణాధికారుల పోస్టులు భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.
ఇవీ చూడండి:ఒకే ఒక్క పోస్టు.. ఆమెను సీఐడీ ముందుకు తీసుకెళ్లింది..!