కాళేశ్వరం స్ఫూర్తిగా రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తిచేసి... సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారం చూపటమే లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు సందర్శనలో భాగంగా... సతీసమేతంగా కాళేశ్వరం వెళ్లిన ముఖ్యమంత్రికి... మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ , ఎర్రబెల్లి దయాకర్ తో పాటు సీఎస్, డీజీపీ, నీటిపారుదలశాఖ అధికారులు స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా కాళేశ్వర, ముక్తేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు గోదావరి జలాలతో ముక్తేశ్వరస్వామికి అభిషేకం చేసి... అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనాలు ఇచ్చిన అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
గోదారమ్మకు పుష్పాంజలి
ప్రత్యేక బస్సులో ప్రాణహిత-గోదావరి సంగమ స్థలి పుష్కరఘాట్‌కు వెళ్లిన కేసీఆర్ దంపతులు... గోదారమ్మకు పుష్పాంజలి ఘటించి, నదిలో పసుపు కుంకుమలు, నాణేలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ ఘట్టం.... నిర్మాణాలనాటి జ్ఞాపకాలను కేసీఆర్ పంచుకున్నారు. తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేస్తూ... రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచే జలదృశ్యాన్ని వీక్షిస్తూ... ఆనందం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో నీటిపారుదల ఇంజినీర్ల కృషిని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు.