తెలంగాణ

telangana

ETV Bharat / city

CM KCR: జనం కోరితే జాతీయ పార్టీ... మోదీ పాలనలో దేశం సర్వనాశనం - సీఎం కేసీఆర్​ వార్తలు

cm kcr fires on bjp: దేశాన్ని ఆగం పట్టిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అన్ని రాజకీయశక్తులూ ఏకమై భాజపాను వెళ్లగొట్టాలని.. ప్రజలంతా కలిసి వస్తే.. నాయకుల పీఠాలు కదిలే పరిస్థితి వస్తుందన్నారు. దేశ ప్రజలంతా కోరితే.. తప్పకుండా జాతీయ పార్టీ పెడతానన్నారు. మోదీ పాలనలో దేశం సర్వనాశనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

cm kcr fires on bjp
cm kcr fires on bjp

By

Published : Feb 14, 2022, 3:44 AM IST

Updated : Feb 14, 2022, 5:55 AM IST

జనం కోరితే జాతీయ పార్టీ... మోదీ పాలనలో దేశం సర్వనాశనం

CM KCR COMMENTS ON BJP: దేశ ప్రజలంతా కోరితే.. తప్పకుండా జాతీయ పార్టీ పెడతానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. తనకు ఆ దమ్ముందని అవసరం వస్తే తప్పకుండా పార్టీ పెడతానన్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. ‘‘తెరాస పార్టీ పుట్టిన నాడు ఏమన్నారు.. ఇప్పుడు ఏమైంది? ఇది ప్రజాస్వామ్యం.. జనం ప్రభంజనమైననాడు అంతా తలకిందులు అయితది. అంతెందుకు చాయ్‌ అమ్ముకున్నా.. అని మోదీనే చెప్పారు కదా. ఆయన ప్రధాని కాలేదా. సినీ నటులు ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రులయ్యారు. ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ.. ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది’’ అని సీఎం అన్నారు.

భాజపా పాలనలో ఎక్కడ చూసినా అవినీతి కంపేనని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో దేశం మొత్తం సర్వ నాశనమవుతోందని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, భాజపా పిచ్చి, పచ్చి అబద్ధాలతో దేశ ప్రజలను మోసం చేస్తోందన్నారు. బ్యాంకులను లూటీ చేసే ఘోరమైన గజదొంగలను సురక్షితంగా దేశం బయటికి పంపారని ఆరోపించారు. రైతుల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలనడం దుర్మార్గమని దుయ్యబట్టారు. విద్యుత్‌ సంస్కరణల పేరిట సబ్సిడీలు నిలిపివేయాలి, బడుగువర్గాలకు ఉచిత విద్యుత్‌ను రద్దు చేసి.. దొంగలకు సద్ది కట్టాలన్నదే భాజపా విధానంగా ఉందన్నారు.

అస్సాం భాజపా సీఎం కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీపై చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఎంతో చరిత్ర గల కుటుంబంపై సంస్కారం లేకుండా మాట్లాడడం సభ్యత కాదని, అలాంటివి ఎవరూ చేసినా తాను వ్యతిరేకిస్తానని తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు కోసం రాహుల్‌ వెనుకేసుకురావాల్సిన ఖర్మ తనకు పట్టలేదని పేర్కొన్నారు. భాజపా అవినీతి చిట్టా తన వద్ద ఉందని, ఒక్కొక్కటి బయటపెడతామన్నారు. భాజపాకి దమ్ముంటే తనను జైలుకు పంపాలని... తన విషయం ఎలా ఉన్నా భాజపా నేతలు మాత్రం జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

దేశాన్ని ఆగం పట్టిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. అన్ని రాజకీయశక్తులూ ఏకమై భాజపాను వెళ్లగొట్టాలి. ప్రజలంతా కలిసి వస్తే.. నాయకుల పీఠాలు కదిలే పరిస్థితి వస్తుంది.

దళితుల, బడుగువర్గాల అభ్యున్నతి, సమాన హక్కుల కోసమే రాజ్యాంగాన్ని మార్చాలి. 19 శాతానికి పెరిగిన దళిత జనాభాకు రిజర్వేషన్లు పెరగడానికి రాజ్యాంగం మారాలి. ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికలు దేశమంతా ఉండాలి. బీసీల జనగణన, హక్కుల కోసం రాజ్యాంగం మారాలి. దేశంలోని 77 శాతం సంపద 10 శాతం మంది దగ్గర ఉండొద్దు. 77 శాతం సంపద 90 శాతంమంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కావాలి. అంబేడ్కర్‌ మహనీయుడే రాజ్యాంగం ప్రగతిశీలంగా ఉండాలన్నారు.

దేశంలో రాజకీయ ఫ్రంట్‌ కాదు.. ప్రజల ఫ్రంట్‌ వస్తుంది. నిన్ననే నాతో మమతా బెనర్జీ మాట్లాడారు. బెంగాల్‌కు ఆహ్వానించారు. త్వరలో ముంబయి వెళ్తా.. ఉద్ధవ్‌ ఠాక్రేను కలుస్తా. ఏదేమైనా ఈ విషయంలో నేను కీలకపాత్ర పోషిస్తా.

ఏయ్‌ కేసీఆర్‌.. నీ సంగతి చూస్తం అంటరు. ఏంది చూసేది? కేసీఆర్‌ భయపడతాడా? దమ్ముంటే భాజపా మొనగాడెవరైనా నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. దేశం అన్ని రంగాల్లో వెనకబడలేదా? నిరుద్యోగం పెరగలేదా?

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

అంతర్యుద్ధాలను ప్రోత్సహిస్తారా?

‘‘ధర్మం పేరిట అంతర్యుద్ధాలను ప్రోత్సహిస్తారా? అమెరికాలో 95 శాతం క్రైస్తవులు ఉంటరు. వాళ్లెప్పుడూ మతపిచ్చి లేపరు. అందుకే ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇక్కడ పొద్దునలేస్తే ఈ పిచ్చి కొట్లాటలు. దాంతో వచ్చేదేంది? ప్రజలు ఆలోచించాలి. రాజకీయంగా అర్థంచేసుకొని స్పందించకపోతే, అవసరమైన విధంగా ప్రజలు తీర్పు చెప్పకపోతే దేశం శ్మశానం అయిపోతుంది. నేను బాధతో చెబుతున్నా. మత పిచ్చి లేపితే ఊరుకుంటామా? ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు. నాశనం చేస్తే చేతులు ముడుచుకొని ఎవడూ కూర్చోడు. భాజపా హయాంలో గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం మరింత పెరిగింది.

రఫేల్‌లో గోల్‌మాల్‌..

రఫేల్‌ విమానాల కొనుగోలులో గోల్‌మాల్‌ జరిగింది. రూ. వేల కోట్లు కాజేశారు. ఇండోనేషియా మనకంటే చౌకగా కొన్నది. భాజపా పాలకుల అవినీతి చిట్టా నా దగ్గర ఉంది. దీనిపై దిల్లీలో పంచాయతీ పెడతా. నన్ను జైల్లో పెట్టుడు కాదు.. మిమ్మల్ని జైలుకు పంపేది పక్కా.

రఫేల్‌లో గోల్‌మాల్‌..

కిషన్‌రెడ్డీ... ఏమిటీ వ్యాఖ్యలు?

ముఖ్యమంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు. రూ. 34,900 కోట్ల ఎరువుల సబ్సిడీ తగ్గించింది అబద్ధమా కిషన్‌రెడ్డి గారూ? ఆహార సబ్సిడీని రూ. 65 వేల కోట్లు తగ్గించింది అబద్ధమా? 40 కోట్ల జనాభా ఉన్న దళితులకు పెట్టింది రూ. 12,800 కోట్లు నిజం కాదా? మీ ఘనత వహించిన ప్రభుత్వంలో దళితులు ఒక్కొక్కరికి రూ. 300 వస్తయి. ఇదేనా ప్రగతి? మా రాష్ట్రం నుంచి ఉన్న ఒకే ఒక్క కేంద్రమంత్రివని మర్యాద పాటించి చెబుతున్నా. మరోసారైతే గట్టిగా చెప్పాల్సి వస్తుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను చూస్తే జాలేస్తోంది. ఆయనకు బదులు వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్‌. రోజురోజుకీ ఆ పార్టీ పరువుపోతోంది.

అమెరికానా.. అహ్మదాబాద్‌ ఎన్నికలా?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మోదీ వెళ్లి ప్రచారం చేయడంతో భారత్‌ పరువు పోయింది. అవి అమెరికా ఎన్నికలా.. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలా? అదొక వ్యూహాత్మక తప్పిదం. ఇప్పుడు మోదీ అమెరికాకు వెళితే పట్టించుకునే వాళ్లే లేరు. దేశంలోని వివిధ బ్యాంకులను ముంచిన 33 మంది లండన్‌లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. వారిలో చాలామంది మోదీ దోస్తులే. అందుకే భాజపాను తరిమికొట్టాలని చెబుతున్నా. ఎన్నికల్లో గెలవకపోయినా పాలించే సిగ్గులేని పార్టీ భాజపా. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మణిపుర్‌లలో గెలవకపోయినా పాలిస్తోంది. మహారాష్ట్రలోనూ గెలవకపోయినా పాలించాలని యత్నించి.. బోల్తా పడింది.

సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ఆధారాలివ్వండి..

సైన్యం జరిపిన మెరుపుదాడుల సందర్భంగా ఏం జరిగిందో కేంద్రం బయటపెట్టాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేయటంలో తప్పేం లేదు. నేను కూడా ఇప్పుడు వాటి ఆధారాలు అడుగుతున్నాను. ఎన్నికల సమయంలో మెరుపు దాడులు పొలిటికల్‌ స్టంట్‌ అని దేశంలో సగంమంది నమ్ముతున్నారు. నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారు.

సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ఆధారాలివ్వండి..

పీకే బృందం సర్వే చేస్తోంది

దేశంలో రాజకీయ పరిస్థితులపై పీకే బృందం సర్వే నిర్వహిస్తోంది. తెలంగాణలో కూడా వారు చేస్తున్నారు. ఇప్పటికే తెరాస సర్వేలు చేయిస్తోంది. పీకే సర్వే ఎలా ఉంటుందో చూస్తాం.

కరోనా వల్ల ప్రధాని పర్యటనకు వెళ్లలేదు

మా కుటుంబంలో ఇద్దరికి కరోనా రావడం వల్ల ఈ నెల 5న ప్రధాని పర్యటనలో పాల్గొనలేకపోయాను. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా... ప్రొటోకాల్‌ నిబంధనలు కచ్చితంగా పాటిస్తాం.

రాష్ట్రంలో కొత్త బడ్జెట్‌ రూ. రెండు లక్షల కోట్లకు చేరుతుంది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 1.86 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణా రూ. 30 వేల కోట్ల ఆదాయం రానుంది. మరింత రావాలని ఆశిస్తున్నాం.

యాదాద్రి పిలుపులపై ఆలోచించలేదు

యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ఎవరిని పిలవాలనేదానిపై ఇంకా ఆలోచించలేదు. ఇప్పటికే మోదీని పిలిచా. మరో నెల సమయం ఉంది. ఏం జరుగుతుందోచూడాలి’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

రెండున్నర గంటల పాటు ప్రెస్‌మీట్‌

సీఎం రెండున్నర గంటల పాటు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో మోదీ గజ్వేల్‌ పర్యటనలో విద్యుత్‌ కొనుగోలు ధరపై చెప్పిన మాటలు, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంపు గెలుస్తారనే వ్యాఖ్యలపై వీడియోలను చూపారు. అయామ్‌ ట్రోల్‌ పేరిట స్వాతి చతుర్వేది భాజపా డిజిటల్‌ ఆర్మీ గురించి రాసిన పుస్తకాన్ని చూపారు. ఆ పుస్తకాలను ప్రచురించి పంపిణీ చేస్తామన్నారు. రఫేల్‌ విమానాల కొనుగోళ్ల కుంభకోణం వార్తాంశాలను ప్రదర్శించారు. చివరిలో ప్రధాని పర్యటన గురించి ఒక విలేకరి ప్రస్తావించగా.. అంతకుముందు మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌పై యూపీలో దాడి జరగడంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తనకు ఫోన్‌ చేసి ప్రధాని భద్రత ఏర్పాట్ల గురించి మాట్లాడారని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని తాను హామీ ఇచ్చానని తెలిపారు.

విద్యుత్‌ చట్టంపై ఒత్తిడి తెస్తున్నారు

‘‘రాష్ట్రం విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయకుంటే.. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టకపోతే నిధులు ఇవ్వకుండా కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌ ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో 25 వేల మీటర్లు పెట్టింది. భాజపా తెలంగాణ అధ్యక్షుడు దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు. ఇప్పుడు ఆధారాలు బయటపెట్టాం. వెంటనే ఆయన బహిరంగ క్షమాపణ వేడుకోవాలి. విద్యుత్‌ సంస్కరణల బిల్లు ఇంకా ముసాయిదాలోనే ఉంది. అయినా ఒత్తిడి తెచ్చి సంస్కరణలను అమలు చేయిస్తోంది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. దేశ ప్రజలను మోసం చేయడమే. రాష్ట్రాలు రూ. 11కి యూనిట్‌ కొన్నాయి.. మేం 1.10 రూపాయలకే ఇస్తున్నామని గజ్వేల్‌ సభలో ప్రధాని అబద్ధాలు చెప్పారు. కేంద్ర విద్యుత్‌ విధానం చెత్త. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించి, వాళ్ల పార్టీకి చందాలు ఇచ్చే వాళ్లు, ఎన్నికలకు డబ్బులిచ్చేటోళ్లు పెట్టే సంస్థల నుంచి సౌర విద్యుత్‌ కొనిపించాలని కుట్ర చేస్తోంది. నాగార్జునసాగర్‌, శ్రీశైలంలో జలవిద్యుత్‌ ఉత్పత్తి బంద్‌ పెట్టయినా దీన్ని కొనాలి.. లేదంటే జరిమానా వేస్తాం అంటున్నారు’’.

ఇదీ చూడండి:CM KCR Comments: కేంద్రాన్ని జైలుకు పంపేది మాత్రం పక్కా: సీఎం కేసీఆర్​

Last Updated : Feb 14, 2022, 5:55 AM IST

ABOUT THE AUTHOR

...view details