వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలకు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. నష్టదాయక కేంద్ర విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధిస్తుందన్నారు. సర్వే ఫలితాలు మన విజయఢంకాను సూచిస్తున్నాయన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో మళ్లీ గులాబీ జెండాను ఎగురవేస్తామన్నారు. ‘నియోజకవర్గంలో పార్టీకి తిరుగులేని ఆధిక్యం ఉంది. తెరాస ప్రభుత్వ విధానాలు, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పార్టీని గెలిపిస్తాయి. విపక్షాలకు భంగపాటు తప్పదు’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్; వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్ర స్థానాలను మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మంత్రులు ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను స్వీకరించి పనిచేయాలని సూచించారు.
‘‘వ్యవసాయం అత్యంత కీలకమైన రంగం. దీనిని కేంద్రం ఆగమాగం చేస్తోంది. అన్నదాతలకు నష్టదాయకమైన కొత్త విద్యుత్ చట్టం తెస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలు కూడా ఏ కోణంలోనూ రైతులకు మేలు చేసేవి కావు. దేశంలో భారీఎత్తున నిల్వలున్నా ఇప్పుడు మక్కలను దిగుమతి చేసుకోవడం దారుణం. కేంద్ర విధానాలను నిలదీయడానికి వెనుకాడం. రాష్ట్రంలో రైతులను దీనిపై చైతన్యవంతం చేయాలి. కేంద్ర విధానాలతో సంబంధం లేకుండా అన్నదాతలకు అండగా నిలుస్తాం. - కేసీఆర్, ముఖ్యమంత్రి.