తెలంగాణ

telangana

ETV Bharat / city

కలెక్టర్లకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన బాధ్యతలు ఇవే! - cm kcr latest news

కలెక్టర్ల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. అందుకే వారికి అండగా ఉండడం కోసం అదనపు కలెక్టర్లను ప్రభుత్వం నియమించినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలని సూచించారు. కలెక్టర్లపై ప్రభుత్వం ఎంతో నమ్మకం ఉంచిందని... అదే సందర్భంలో కలెక్టర్లకు ఎంతో బాధ్యత ఉందని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రాధాన్యతలు, కలెక్టర్ల బాధ్యతలను సీఎం వివరించారు.

cm kcr
cm kcr

By

Published : Feb 11, 2020, 5:26 PM IST

Updated : Feb 11, 2020, 9:30 PM IST

కలెక్టర్లకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన బాధ్యతలు ఇవే!

కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యాలు వారు ఎంచుకోవద్దని, అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఒక టీమ్ లాగా రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు యంత్రాంగం ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వర్తించాలని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రాధాన్యతలు, కలెక్టర్ల బాధ్యతలను సీఎం వివరించారు. కలెక్టర్ల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి... కలెక్టర్లకు అండగా ఉండేందుకు అదనపు కలెక్టర్లను నియమించిందని చెప్పారు. కలెక్టర్లపై ప్రభుత్వం ఎంతో నమ్మకం ఉంచిందన్న కేసీఆర్​... వారికి ఎంతో బాధ్యత ఉందని గుర్తు చేశారు. గతంలో కలెక్టర్లు 112 కమిటీలకు ఛైర్మన్​గా వ్యవహరించేవారని ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా మార్చడం వల్ల కొంత పని ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు.

అధికారాలు ఇచ్చాం..

గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుందని సీఎం తెలిపారు. వేరే ఖర్చులు ఆపి... గ్రామాలకు నిధులు ఇస్తున్నామని వెల్లడించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని.. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రైబ్యునల్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కలెక్టర్లపై నమ్మకంతో ప్రభుత్వం తన అధికారాలను వదులుకుని... వారికి బదిలీ చేసిందని తెలిపారు. ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చేలా పనిచేయించే విధి కలెక్టర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే అక్కడ వేరొకరిని నియమించే అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తున్నట్లు సీఎం చెప్పారు.

ఇదే కలెక్టర్ల పనితీరుకు గీటురాయి

అడవుల్లో కలప స్మగ్లింగును అరికట్టడానికి కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలని... చెట్లు నరకకుండా చూడాలని ఆదేశించారు. అడవిని పునరుద్ధరించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని తెలిపారు. అడవుల శాతం తక్కువగా ఉన్న హైదరాబాద్, గద్వాల, కరీంనగర్, జనగామ, వరంగల్ అర్బన్, యాదాద్రి, సూర్యాపేట, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్లు సామాజిక అడవులు పెంచేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మంత్రులు, కలెక్టర్ల బాధ్యత అని... ఇదే వారి పనితీరుకు గీటురాయని పేర్కొన్నారు. మొక్కలు నాటి, సంరక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించే సమస్యే లేదని స్పష్టం చేశారు.

సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి

అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ అక్షరాస్యత విషయంలో మాత్రం వెనుకబడి ఉందని... రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిన తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచులకు అప్పగించాలని, పూర్తి అక్షరాస్యత జిల్లాగా మార్చే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సాధించిన అక్షరాస్యతను జనాభా లెక్కల్లో కూడా నమోదు చేయించాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యత పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

ఇదీ చూడండి:అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం : సీఎం కేసీఆర్

Last Updated : Feb 11, 2020, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details