కరోనా కారణంగా విద్యావ్యవస్థ ఇబ్బందుల్లో పడిందన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యాసంస్థల మూసివేతతో విద్యార్థులు, తల్లిదండ్రులు సహా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యా అనుబంధ రంగాల్లో అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. గతం కంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని వైద్యాధికారులు నివేదికలు ఇచ్చారని సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసంచారం సాధారణ స్థాయికి వస్తోందన్నారు. విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడం వల్ల విద్యార్థుల్లో ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందని.. అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఉందన్న అధ్యయనాన్ని వైద్యారోగ్యశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యాసంస్థల పున:ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సీఎం తెలిపారు. ఇతర పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు, అంగన్వాడీలనూ తెరవాలని నిర్ణయించామన్నారు.
పలు శాఖలకు బాధ్యతలు..
ఇన్నాళ్లుగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలను శుభ్రపరిచే బాధ్యతను పంచాయతీరాజ్, పురపాలకశాఖలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యాసంస్థల ఆవరణ పరిశుభ్రంగా ఉంచే బాధ్యత సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లదేనని సీఎం స్పష్టం చేశారు. నెలాఖరుకల్లా ప్రత్యేక శ్రద్ధతో మరుగుదొడ్లు సహా, విద్యాసంస్థల ఆవరణలను సోడియం క్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్‌తో పరిశుభ్రం చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. విద్యాసంస్థల పరిధిలోని నీటి ట్యాంకులను తేటగా కడిగించాలని సూచించారు. తరగతి గదులను కడిగించి శానిటైజేషన్ చేయించాలని సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా, మండల పరిషత్ ఛైర్మన్లు.. క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని పాఠశాలలు పరిశుభ్రంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు. డీపీవో, జడ్పీ సీఈవో, ఎంపీవో, ఎంపీడీవో ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి.. నిర్ధరించాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.