దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు తగిన అంశాలపై కేసీఆర్ బృందం అధ్యయనం చేస్తోంది. యువత అసంతృప్తిగా ఉన్న అంశాలపై ప్రశాంత్‌కిషోర్ బృందం.. ఒక నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. అన్ని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో నెట్‌వర్క్ ఏర్పాటుకు.... తెరాస ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో సాగునీరు, విద్యుత్ తగినంత అందుబాటులో ఉన్నా... వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కేంద్రంలో పాలించిన భాజపా, కాంగ్రెస్ విఫలం కావడంవల్లే.. అన్నదాతలకు కష్టాలు తప్పట్లేదని ప్రచారం చేయనున్నారు. అందుకు గణాంకాలు, ఉదాహరణలతో పుస్తకాలు ముద్రించడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరవేసేలా వ్యూహరచన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అంశాలతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజల ప్రత్యేక డిమాండ్లు, బలమైన ఆకాంక్షలేమిటీ... వాటిపై భాజపాతో పాటు అక్కడి పార్టీల వైఖరి ఏమిటనే అంశాలను ప్రశాంత్ కిషోర్ సహకారంతో గులాబీ పార్టీ పరిశీలిస్తోంది. వాటిపై స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
భాజపా, కాంగ్రెస్‌కి దూరంగా ఉన్న వివిధ పార్టీల నేతలతో పాటు.... మేధావులు, ప్రముఖులు, విశ్రాంత అధికారులతో.... కేసీఆర్ నిరంతరం చర్చిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో చర్చించి... భాజపా విధానాల వల్ల దేశానికి జరగబోయే నష్టంపై ప్రజలకు మరింత సమర్థంగా వివరించాలని కోరారు. గతంలో వివిధ పార్టీల నేతలతో పాటు కర్ణాటకకు చెందిన నటుడు ప్రకాష్ రాజ్, తమిళ హీరో విజయ్ వంటి ప్రముఖులను అదే కోరినట్లు సమాచారం. భాజపాపై ధ్వజమెత్తతున్న నేతలు, ప్రజాసంఘాలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులందరితో..... ఫోన్లలో చర్చిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి, రైతునేత టికాయత్, కార్మిక సంఘాలతోనూ సంప్రదింపులు చేశారు. భాజపాను వ్యతిరేకించే దాదాపు అన్ని పార్టీలతో సమాలోచనలు చేశారు. ఐతే భాజపా, కాంగ్రెస్‌కి సమదూరం అనే సంకేతం మాత్రం స్పష్టంగా ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారు. కొన్ని పార్టీలు.... భాజపాను వ్యతిరేకిస్తున్నా......కాంగ్రెస్‌కు అనుకూల వైఖరితో ఉన్నందున.. ప్రస్తుతానికి వాటికి దూరంగానే ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రాల్లో అధికారంలో పార్టీలు కాకపోయినా.. జేడీఎస్, ఆర్జేడీ, మరో రెండు, మూడు పార్టీలు... కచ్చితంగా తమ వెంట కలిసి వస్తాయని గులాబీ బృందం విశ్వసిస్తోంది. దేశవ్యాప్తంగా కొంత నెట్‌వర్క్ ఏర్పడిన తర్వాత భారీ స్థాయిలో జాతీయ పార్టీ ప్రకటించాలా.. లేదా వెంటనే పార్టీ ప్రకటన చేసి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలా అనే అంశంపై ఐదారు రోజుల్లో తుదినిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.