లాక్డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్రం సరైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో పలు సూచనలు చేశారు. రిజర్వ్ బ్యాంకు క్వాంటేటీవ్ ఈజింగ్ విధానాన్ని అవలంభించి హెలికాప్టర్ మనీ రూపంలో నిధులు విడుదల చేయాలని ప్రతిపాదించారు. సంక్షోభాల సమయంలో ఇదే తరహా విధానాన్ని అవలంభిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రాలకు రుణ పరిమితిని మూడు నుంచి ఐదు లేదా ఆరు శాతానికి పెంచాలని కేసీఆర్ కోరారు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరారు. రాష్ట్రాల అప్పులకు కనీసం ఆర్నెళ్ల వాయిదా వేసేలా కేంద్రం చొరవ చూపాలని కోరారు. ధాన్యం సేకరణకు ఎఫ్సీఐ నుంచి డబ్బు వచ్చేందుకు సమయం పడుతుందన్న ముఖ్యమంత్రి... బకాయిలపై బ్యాంకులు ఒత్తిడి చేయకుండా చూడాలని కోరారు.