ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి తిరిగి వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం అందివ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు.
ఇక జూనియర్, డిగ్రీ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ కళాశాలల్లో డ్రాపవుట్స్ తగ్గించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థి సాయంత్రం వరకు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం పెట్టనున్నట్లు సీఎం ప్రకటించారు.
జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన చర్చ వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న సమాచారం తెలుసుకున్నారు. వారిని అభినందించారు. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని సీఎం చెప్పారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా ముఖ్యమంత్రి మంజూరు చేశారు.
జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వివిధ రకాల మొక్కలతో గార్డెన్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గార్డెన్ అభివృద్ధి చేసి, అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా అభినందించారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్ కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారు.