పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుతంగా అమలవుతూ తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు సమకూరుతున్నాయని అన్నారు. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేవలం 84 గ్రామపంచాయతీలకు మాత్రమే సొంతగా ట్రాక్టర్లు ఉండేవన్న సీఎం... ఇపుడు మొత్తం 12,765 గ్రామపంచాయతీలకు గాను 12,681 గ్రామాల్లో ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు సమకూరాయని చెప్పారు. తెలంగాణ పల్లెల్లో పచ్చదనం వెల్లివిరుస్తోందని... పచ్చదనం – పరిశుభ్రత విషయాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటిన మొక్కల్లో 91శాతం బతికాయన్న ముఖ్యమంత్రి... 19,470 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు లక్ష్యానికి గాను 19,027 చోట్ల స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. 15,646 చోట్ల మొక్కలు కూడా నాటడం పూర్తయిందని, మిగతా చోట్ల వేగంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 2,601 చోట్ల రైతు వేదికలు నిర్మాణం ప్రారంభం కాగా, ఇప్పటికే 2580 చోట్ల నిర్మాణం పూర్తయిందని సీఎం చెప్పారు.
పర్యవేక్షణ పక్కాగా ఉండాలి..!
రాష్ట్రవ్యాప్తంగా 12,736 గ్రామాల్లో నిర్మాణమవుతోన్న డంపింగ్ యార్డుల పనులు 91శాతం పనులు పూర్తయ్యాయని... 9,023 చోట్ల డంపింగ్ యార్డుల్లో కంపోస్ట్ తయారవుతోందని చెప్పారు. 12,742 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 93,875 చోట్ల కల్లాల నిర్మాణం ప్రారంభమైందని అన్నారు. పంచాయతీలకు ప్రతినెలా రూ. 308 కోట్ల చొప్పున ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తుండడంతో గ్రామాభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధం లేకుండా సాగుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నిరకాల సౌకర్యాలు, వెసులుబాట్లు, పచ్చదనం, పరిశుభ్రత, పారదర్శక పద్ధతులు కలిగిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదని, గ్రామాల్లో పెరిగిన పరిశుభ్రత వల్ల ఈసారి డెంగ్యూ వ్యాధి రాకపోవడాన్ని గమనించవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు నేలవిడిచి సాము చేయకుండా గ్రామాలే కార్యవేదికగా గుర్తించాలని, గ్రామాలను గొప్పగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ మార్గనిర్ధేశం చేశారు. అదనపు కలెక్టర్లు, డీపీఓలు తరచూ గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించాలని... మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించినప్పుడు పల్లె ప్రగతి పనులను ఖచ్చితంగా సమీక్షించాలని చెప్పారు. ఎంపీఓలు నిత్యం అన్ని గ్రామాల్లో పర్యటించాలని సీఎం ఆదేశించారు.
ప్రశంసలు..
పల్లెప్రగతి కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా అద్భుతంగా పనులు సాగేలా కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధతో పల్లె ప్రగతి పనులను పర్యవేక్షిస్తున్నారని... సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు ఎంతో శ్రమకోర్చి పనులు చేస్తున్నారని సీఎం కేసీఆర్ అభినందించారు. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని వందశాతం నెరవేర్చిన సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావును ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. సంగారెడ్డి జిల్లాను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా వైకుంఠధామాలు పూర్తి చేయాలని కోరారు.