CM KCR Comments: ప్రభుత్వాలను కూలగొట్టడమే భాజపా రాజకీయమా..? దమ్ముంటే తెలంగాణ, తమిళనాడులో ఏక్‌నాథ్ శిందేలను తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత్‌కు చైనా అత్యంత ప్రమాదకారని.. భారత్ - చైనా సరిహద్దు ప్రయోగశాల కాదని.. ప్రయోగాలతో దేశానికి ముప్పని మాజీ లెఫ్ట్‌నెంట్ జనరల్స్ చెప్పినట్టు కేసీఆర్ వివరించారు. వర్షాలకు కాశీ ఘాట్‌లో ప్రధాన గోపురం కూలిపోయిందని.. అది దేశానికి అరిష్టమని ప్రజలు బాధపడుతున్నట్టు తెలిపారు. కానీ.. భాజపా మాత్రం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటుందని కేసీఆర్ ధ్వజమెత్తారు. తప్పకుండా మోదీ ప్రభుత్వాన్ని మారుస్తామని.. ఎల్‌ఐసీని అమ్మనీయమన్నారు. తమ అజెండా ఏంటో త్వరలో చెబుతామన్నారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. "మోదీ గారూ.. దమ్ముంటే తమిళనాడు, తెలంగాణలో ఏక్‌నాథ్ శిందేలను తీసుకురండి చూద్దాం. ప్రభుత్వాలను కూలగొట్టడమే మీ రాజకీయమా..? ఇతర ప్రభుత్వాలను కూలగొట్టడం గొప్ప విషయమా..?" అని సీఎం కేసీఆర్ నిలదీశారు.
దేశంలో కొత్త పార్టీ వద్దా?
"మాతో పెట్టుకుంటే అగ్గితో గోక్కున్నట్టే. నువ్వు గోక్కున్నా గోక్కోకపోయినా.. నేను మాత్రం గోకుతూనే ఉంటా? శ్రీలంకలో ప్రాజెక్టు ఒకటి ఆయన స్నేహితుడికే ఇచ్చారు. భారత ప్రభుత్వం నామినేట్ చేసిందని, మోదీ ఒత్తిడి వల్లే ప్రాజెక్టు ఇచ్చామని అక్కడి అధికారులు చెప్పారు. చరిత్రలో ఏ ప్రధాని ఆ విధంగా నామినేట్ చేయలేదు. భారత ప్రధాని పట్ల శ్రీలంకలో నిరసనలు తెలుపుతున్నారు. భారతదేశంలో కురిసే వర్ష పాతం లక్షా 40వేల టీఎంసీలు. నదుల నుంచి మనం తీసుకునే అవకాశమున్న నీరు 70వేల టీఎంసీలు.. ఇందులో మనం తీసుకుంటున్నది కేవలం 22వేల టీఎంసీలు మాత్రమే. 6వేల టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్ జింబాబ్వేలో ఉంది. భారతదేశ భూమి విస్తీర్ణం 83 కోట్ల ఎకరాలు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని అడ్వాంటేజ్ భారత్‌కు ఉంది. 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. కేంద్రం అసమర్థ విధానాల కారణంగా పిచ్చి ముఖాలు వేసుకుని మెక్ డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం. దేశంలో 52శాతం యువత ఉంది. ప్రగతి బాట పట్టాల్సిన యువతను పక్కదారి పట్టిస్తున్నారు. గుణాత్మక మార్పు రావాలి.. విప్లవ బాటలో పయనించాలి. దేశంలో కొత్త పార్టీ రావద్దా? అవసరమైతే తెరాస జాతీయ పార్టీగా మారుతుంది. తెలంగాణలో మాదిరిగా గొప్ప ప్రాజెక్టు కట్టుకోలేమా? దేశంలో అద్భుత ప్రగతికి శ్రీకారం చుట్టాలి."- సీఎం కేసీఆర్