తెలంగాణ

telangana

ETV Bharat / city

CM KCR Comments: 'అవసరమైతే.. దేశం కోసం కొత్త పార్టీ పెడతా' - నేషనల్​ పార్టీ

CM KCR COMMENTS ABOUT FOUNDING NEW NATIONAL PARTY
CM KCR COMMENTS ABOUT FOUNDING NEW NATIONAL PARTY

By

Published : Feb 13, 2022, 7:32 PM IST

Updated : Feb 13, 2022, 9:13 PM IST

19:30 February 13

'తెరాసకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు'

'అందరి కోరిక అదే అయితే.. దేశం కోసం కొత్త పార్టీ పెడతా'

CM KCR Comments: అందరూ కోరుకుంటే.. దేశం కోసం కొత్త పార్టీ పెడతానని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు. దేశం కోసం ముందుకు కదలాల్సింది దేశ ప్రజలేనని పునరుద్ఘాటించారు. జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరన్నారు. ప్రజలు కలిసి వస్తే.. నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కోసం రాహుల్‌ను వెనకేసుకొస్తున్నారని వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తెరాసకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎవరు ఎవరితో కలుస్తారన్నది కాలం చెబుతుందన్నారు. భాజపా అరాచక పాలనపై దేశమంతా చర్చ జరగాలని పిలుపునిచ్చారు.

అన్ని రాజకీయ శక్తులు ఏకమవ్వాలి..

"దేశంలోని అన్ని రాజకీయ శక్తులు ఏకమై భాజపాను వెళ్లగొట్టాలి. భవిష్యత్‌ రాజకీయాలను ఊహించి చెప్పలేం. భాజపా అరాచక పాలనపై దేశమంతా చర్చ జరగాలి. ఈ దేశం కోసం ముందుకు కదలాల్సింది దేశ ప్రజలే. కుల, మతాలు పక్కన పెట్టి జనమంతా పిడికిలి బిగించాలి. అప్పుడే దేశ ప్రగతిని సాధించగలం. జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరు. ప్రజలు కలిసివస్తే నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుంది. అందరి కోరిక అదే అయితే.. దేశం కోసం కొత్త పార్టీ అవసరమైతే పెడతా. కొత్త పార్టీ పెడితే తప్పేమీ లేదు. మన దేశ ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ ఉంది. ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. ఏదైనా సాధించవచ్చు. తెరాస స్థాపించినప్పుడు ఎన్నో మాటలన్నారు. ఆత్మవిశ్వాసంతో పోరాడి.. జనాల్లో చైతన్యాన్ని తెచ్చాం. కఠోర సమైక్యవాదినన్న చంద్రబాబు.. జై తెలంగాణ అనలేదా? సమైక్యవాద పార్టీ సీపీఐ జై తెలంగాణ అనలేదా? రాజకీయ ఫ్రంట్‌ను ఊహించొద్దు... ప్రజల ఫ్రంట్‌ను ఊహించండి. నేను ముంబయి వెళ్తా.. ఉద్ధవ్‌ ఠాక్రేను కలుస్తా. ఏదేమైనా ఈవిషయంలో నేను కీలకపాత్ర పోషిస్తా. దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు." - సీఎం కేసీఆర్‌

ధర్మం పేరిట విద్వేష రాజకీయం..

హిజాబ్‌పై దేశం మొత్తం మౌనం వహిస్తోందని సీఎం కేసీఆర్​ తెలిపారు. కర్ణాటకలోని విద్వేషం అంతటా వస్తే దేశం గతేంటని హెచ్చరించారు. ధర్మం పేరిట అంతర్యుద్ధాలను ప్రోత్సహిస్తారా? అని నిలదీశారు. దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగులుస్తున్నారని మండిపడ్డారు. ధర్మం పేరిట విద్వేష రాజకీయం మానుకోవాలని హితవు పలికారు. భాజపా విద్వేష రాజకీయాల గురించి యువత ఆలోచించాలని సూచించారు. శాంతి లేని చోట ఎవరు పెట్టుబడులు పెట్టరన్నారు. శాంతిభద్రతలు కోరుకుందామా?.. ఘర్షణలు, కర్ఫ్యూలు కోరుకుందామా? అని ప్రజలను ప్రశ్నించారు.

సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ఆధారాలివ్వండి..

రాహుల్ గాంధీ పట్ల అసోం సీఎం వ్యాఖ్యలు సమంజసమేనా? అని కేసీఆర్​ నిలదీశారు. రాహుల్​పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని వదిలిపెట్టనన్నారు. అసోం సీఎంను భాజపా ప్రోత్సహిస్తోందా అని ప్రశ్నించిన కేసీఆర్​.. ఆయనపై భాజపా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ఆధారాలు కేంద్రం బయటపెట్టాలని రాహుల్​ గాంధీ డిమాండ్​ చేయటంలో తప్పేమీ లేదని కేసీఆర్​ స్పష్టం చేశారు. తాను కూడా ఇప్పుడు వాటి ఆధారాలు అడుగుతున్నానని తెలిపారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌.. పొలిటికల్‌ స్టంట్‌ అని దేశంలో సగం మంది నమ్ముతున్నారని.. దాంట్లో నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నారు.

గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం..

గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని, సరిగ్గా పనిచేయడం లేదని సర్కారియా కమిషన్‌ చెప్పినట్టు గుర్తుచేశారు. గవర్నర్‌ వ్యవస్థ దుర్వినియోగం భాజపా హయాంలో పెరిగిందని ఆరోపించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని.. ఒకరినొకరు గౌరవించాలని సీఎం కేసీఆర్​ సూచించారు.

ఇవీ చూడండి:

Last Updated : Feb 13, 2022, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details