సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాలు గురువారం రాష్ట్రంతోపాటు దేశవిదేశాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటి నీళ్లు పోస్తున్న సీఎం కేసీఆర్, శోభ దంపతులు. చిత్రంలో మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, కుమార్తె అలేఖ్య, కేటీఆర్, ఆయన కుమారుడు హిమాన్ష్. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి పావురాలను ఎగురవేశారు.
ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. రాష్ట్రంతో పాటు దేశవిదేశాల్లోనూ పార్టీ శ్రేణులు, ఉద్యోగ సంఘాలు, సేవాసమితులు, అభిమానులు భారీఎత్తున కార్యక్రమాలను నిర్వహించారు. ‘హ్యాపీ బర్త్‌డే కేసీఆర్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. కొంపల్లిలో దివ్యాంగులకు 300 త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు. అసెంబ్లీలో జరిగిన ఉత్సవాల్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేక్‌ను కోశారు. మండలి ప్రొటెం ఛైర్మన్ అమీనుల్ జాఫ్రి, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి విరాళంగా ఇచ్చిన ఆంబులెన్స్‌ను కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో రంగనాయక్‌సాగర్ ఎడమ కాలువల నుంచి రైతులకు గోదావరి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సాగర్ కట్టపై కేక్ కోశారు. టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటుచేసిన శిబిరంలో ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు.
తెలంగాణ భవన్‌లో..
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్‌లో భారీఎత్తున వేడుకలు జరిగాయి. బోనాలు, బతుకమ్మలు, చెంచు, కోయ, ఒగ్గు కళాకారులు డప్పు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. భారీ కేక్‌ను తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు కోశారు. కేసీఆర్ జీవిత చరిత్రపై 3డీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో హిందీలో రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. భవన్ ప్రధాన ద్వారం వద్ద త్రీడీ కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీఎన్జీవో, టీజీవో కార్యాలయాల్లో, ఆబ్కారీ కమిషనరేట్‌లో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా..
రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని మేడారంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు సమ్మక్క, సారలమ్మలను ప్రార్థించారు. నల్గొండలో మంత్రి జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఖమ్మంలో మంత్రి అజయ్‌కుమార్ నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. కరీంనగర్‌లో కేసీఆర్ సైకత శిల్పాన్ని రూపొందించారు. కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, కార్పొరేటర్ సరితా అశోక్‌లు పేదలకు కోళ్లను పంపిణీ చేశారు. నిజామాబాద్‌లో తెరాస జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల వద్ద ఉత్సవాలను జరిపారు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామంలో భాగ్యశ్రీ, చంద్రకాంత్ అనే దంపతులు తమ కుమారుడికి కేసీఆర్ పేరు పెట్టుకున్నారు. హైదరాబాద్ నగరంలోని పీపుల్స్ ప్లాజా వద్ద ఒడిశా కళాకారులు రూపొందించిన కేసీఆర్ సైకత శిల్పాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. దిల్లీలో తుగ్లక్ రోడ్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రాజ్యసభ సభ్యుడు కె.ఆర్.సురేష్‌రెడ్డి కేకు కోసి.. మొక్కను నాటారు.
సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు
తనకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుపేరునా ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. వారి అభిమానానికి ధన్యుడినని ఆయన పేర్కొన్నారు.
నాన్నే నా హీరో: కేటీఆర్
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడాన్ని కేసీఆర్ అలవాటుగా మార్చుకున్నారు. దయతో నిండిన హృదయంతో అందర్నీ ముందుకు నడిపిస్తున్నారు. కేసీఆర్‌కు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఉంది. ఆయన నా నాయకుడు.. నా తండ్రి.. అని గర్వంగా పిలుచుకుంటాను.
-మంత్రి కేటీఆర్ ట్వీట్