నిపుణుల కమిటీ నివేదిక రాగానే జీవో 111ను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బడ్జెట్ పద్దులపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చకు సీఎం సమాధానమిచ్చారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన నాలుగురోజుల విశ్రాంతి అనంతరం శాసనసభకు హాజరై సుదీర్ఘంగా మాట్లాడారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధవర్గాలకు పలు వరాలు ప్రకటించారు. కేంద్రం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
‘‘గతంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి హైదరాబాద్ నగరానికి మంచినీళ్లు వచ్చేవి. అవి కలుషితం కాకుండా ఉండటానికి 7 మండలాల్లోని 83 గ్రామాల్లో భూముల వినియోగంపై అంక్షలు పెడుతూ జీవో 111 తెచ్చారు. కానీ వాటి నుంచి ఇప్పుడు మంచినీరు నగరానికి అవసరం లేదు. మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీరు నగరానికి వస్తుంది. వంద సంవత్సరాల వరకు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదు. ఈ నేపథ్యంలో జీవో 111 అర్థ రహితం. ఒకేసారి దానిని రద్దుచేస్తే ఇబ్బందులు రాకుండా అక్కడ గ్రీన్జోన్లు ఏర్పాటుచేసేలా మున్సిపల్ శాఖ చూడాలి. ఈ జీవో రద్దుపై నిపుణుల కమిటీని ఏర్పాటుచేశాం. నివేదిక రాగానే జీవోను ఎత్తేస్తాం.
ఉక్రెయిన్‌లో 20 వేల పైచిలుకు విద్యార్థులు చిక్కుకున్నారు. తెలంగాణ నుంచే వారిలో 740 మంది ఉంటే వీరిలో 710 మంది ఎంబీబీఎస్ చదవడానికే వెళ్లారు. ఇక్కడ ఎంబీబీఎస్ చదవాలంటే రూ.కోటికిపైగా ఖర్చవుతున్నందున అంత భరించలేక పలువురు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకే ఉక్రెయిన్‌లో చదవడానికి వెళుతున్నారు. యుద్ధం వల్ల విద్యార్థులు తిరిగి ఉక్రెయిన్‌కు పోయే పరిస్థితి లేదు. వారి చదువు ఇక్కడ కొనసాగించే అవకాశం ఇవ్వాలని కేంద్రానికి రాస్తాం. వారి చదువుకు ఎంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. యుద్ధం వల్ల మన పిల్లలు ఉక్రెయిన్‌లో ఇబ్బందులు పడుతుంటే కొందరు కేంద్రమంత్రులు వారిని విమర్శిస్తూ ‘తిన్నది అరగక అక్కడికి ఎందుకు పోయారు’ అని మాట్లాడారు. ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థుల గురించి మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా ? దీనిపై మేం ఏమైనా మాట్లాడితే దేశద్రోహులని ముద్ర వేస్తున్నారు.
- సెర్ప్, మెప్మాల్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం.
- ఉపాధి హామీ పథకం విభాగంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారు గతంలో సమ్మె చేశారు. భ్రమలకు పోయి సమ్మె చేయవద్దని అప్పుడే చెప్పాం. అయినా వినకుండా సమ్మె చేశారు. వాళ్ల మీద మాకు కోపం ఎందుకు ఉంటుంది? వాళ్లందరినీ మళ్లీ ఉద్యోగాల్లో చేర్చుకుంటాం.
- ఉద్యోగాలకు పోటీ పరీక్షలన్నింటినీ ఉర్దూ భాషలో కూడా నిర్వహిస్తాం.
- పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో మైనార్టీ వర్గానికి చెందినవారిని సభ్యుడిగా నియమిస్తాం.
- తెలంగాణ ఏర్పడినప్పుడు 3 వైద్య కళాశాలలుంటే ఇప్పుడు 33కి పెంచుతున్నాం. ప్రతీ కాలేజీలో నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటుచేస్తాం
- వరంగల్, మంథని, ఖమ్మం, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఆ రైతుల వివరాలను వ్యవసాయశాఖ సేకరించి పంపితే పరిహారం ఇస్తాం.
- పాతబస్తీలో రోడ్లు వెడల్పు చేయడానికి మరో రూ.200 కోట్లు ఇస్తాం.
- మధ్యాహ్న భోజన పథకం విభాగంలో పనిచేస్తున్నవారికి ప్రస్తుతం నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. దానిని రూ.3 వేలకు పెంచుతాం.
- గ్రామ రెవెన్యూ సహాయకులను నీటిపారుదలశాఖలో లష్కర్లుగా నియమిస్తాం.
- సాదాబైనామాల వారి భూముల వివరాలను ధరణిలో నమోదుకు చర్యలు తీసుకుంటాం.
- నీటిపారుదల, వైద్యశాఖల్లో ఎస్సీ ఉద్యోగులకు పదోన్నతులిస్తాం.
- ఐఏఎస్ అధికారుల కమిటీ నివేదిక అందగానే మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్‌లోని ఆలయభూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం.
- ఎమ్మెల్యేలు, అధికారులు, విలేకరులకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. అది తేలగానే వారికి స్థలాలిస్తాం.
- ఏపీ, తెలంగాణ అనుమతి లేకుండా గోదావరి నదీ జలాలను ఇతర నదులతో అనుసంధానం చేసి జలాలను తరలించే అవకాశం లేదు. సీతారామసాగర్ పూర్తయితే ఖమ్మం జిల్లాల్లో పుష్కలంగా నీరు అందుతుంది.
డబుల్ ఇంజిన్ కాదు.. ట్రబుల్ ఇంజిన్
ప్రస్తుత మోదీ పాలనలో 5 లక్షల సంస్థలు మూతపడ్డాయి. నిరుద్యోగిత రేటు యూపీఏ హయాంలో 4.7 శాతముంటే ఇప్పుడు 7.11కి పెరిగింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ ర్యాంకుల్లో భారత్ 93కి చేరింది. ఆత్మనిర్భర్ అన్నారు. దేశం ఆత్మనిబ్బరం కోల్పోయింది. మతపిచ్చి కార్చిచ్చులా దహించివేస్తుంది. ఇలాంటి కేంద్ర పాలన వల్ల దశాబ్దాల తరబడి ప్రగతికి కొనసాగిన కృషి కుప్పకూలుతుంది. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ‘డబుల్ ఇంజిన్ గ్రోత్’ అని కొందరు కొత్త నినాదంతో ప్రచారం చేస్తున్నారు.ప్రజలు అమాయకులు కాబట్టి దీన్ని నమ్మే పరిస్థితి ఉంది. కానీ అది ట్రబుల్ ఇంజిన్ అని సభ్యులు అంటున్నారు. కేంద్రంలో, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకే పార్టీ అధికారంలో ఉన్నా అనేక అంశాల్లో తెలంగాణకన్నా వెనుకబడి ఉంది.తలసరి ఆదాయంలో సిక్కిం తరవాత దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.