తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రజా పరిషత్​లకు నిర్దిష్టమైన విధులు, నిధులు, బాధ్యతలు' - సీఎం కేసీఆర్​

రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని సీఎం  కేసీఆర్ తెలిపారు. పంచాయతీలతో పాటు మండల పరిషత్, జడ్పీలను క్రియాశీలకంగా మారుస్తామని ప్రకటించారు. గ్రామాల్లో నిర్వహించిన 30 రోజుల ప్రణాళిక ఆశించిన ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు. మండల పరిషత్‌లకు కూడ నిర్దిష్టమైన నిధులు, విధులు అప్పగించడానికి కసరత్తు జరుగుతోందని వెల్లడించారు.

cm kcr

By

Published : Oct 16, 2019, 11:53 PM IST

Updated : Oct 17, 2019, 5:20 AM IST

ప్రజా పరిషత్​లకు నిర్దిష్టమైన విధులు, నిధులు, బాధ్యతలు
రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని, గ్రామ పంచాయతీలతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్​లను క్రియాశీలకంగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ సభ్యుడిగా నియామకమైన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండకు చెందిన గటిక అజయ్ కుమార్... ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి.. కృతజ్ఞతలు తెలిపారు. అజయ్ కుమార్​కు సీఎం అభినందనలు తెలిపారు.

30 రోజుల ప్రణాళికపై హర్షం:

30 రోజుల ప్రణాళిక ఆశించిన ఫలితాలు సాధించిందని సీఎం కేసీఆర్​ సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల పరిషత్, జిల్లా పరిషత్​లకూ నిర్దిష్టమైన విధులు, నిధులు, బాధ్యతలు అప్పగించడానికి కసరత్తు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. త్వరలోనే ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ ఛైర్మన్లతో హైదరాబాద్​లో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆర్థిక సంఘం నిధులను ప్రతీ నెలా రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇదే తరహాలో మండల, జిల్లా పరిషత్​లకూ నిధులు విడుదల చేస్తామని సీఎం వెల్లడించారు.

ఆదర్శ గ్రామాలే అభిమతం:

తెలంగాణ పల్లెలు దేశంలో కెల్లా ఆదర్శ గ్రామాలుగా మారాలన్నదే తన అభిమతమని సీఎం వెల్లడించారు. ప్రజల విస్తృత భాగస్వామ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నాయకత్వంలో పల్లెలు బాగు పడాలని ఆకాంక్షించారు. దీనికి అవసరమైన ఆర్థిక ప్రేరణను ప్రభుత్వం అందిస్తుందని, మంచి విధానం తీసుకొస్తుందని చెప్పారు. గ్రామ స్థాయిలో ప్రజలు సమైక్యంగా ఉండి, గ్రామాలను బాగు చేసుకోవాలని, నిధులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి: మద్యం టెండర్లకు భలే గిరాకీ..

Last Updated : Oct 17, 2019, 5:20 AM IST

ABOUT THE AUTHOR

...view details