తెలంగాణ

telangana

ETV Bharat / city

'చేతులు జోడించి అడుగుతున్నా.. తెలంగాణ ధాన్యం కొనండి'

KCR at TRS Protest in Delhi : దేశాన్ని అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తే.. ప్రశంసించేది పోయి.. కేంద్రం అవమానిస్తోందని... కేసీఆర్‌ దుయ్యబట్టారు. ఎన్నో కష్ట నష్టాలు పడి రాష్ట్రాన్ని సాధించుకుని... కోటి ఎకరాల్లో పంట పండిస్తూ ముందుకెళ్తుంటే.. ఆదుకోవాల్సింది పోయి.. అవమానించమేంటని... ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలనే ప్రధాన డిమాండ్‌తో దిల్లీ వేదికగా.. తెరాస చేపట్టిన నిరసన దీక్షలో కేసీఆర్ పాల్గొన్నారు. కేంద్ర విధానాలపై మండిపడ్డ సీఎం.. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చేతులు జోడించి మోదీ సర్కార్‌ను వేడుకున్నారు.

KCR at TRS Protest in Delhi
KCR at TRS Protest in Delhi

By

Published : Apr 11, 2022, 1:14 PM IST

Updated : Apr 11, 2022, 1:31 PM IST

దిల్లీలో తెరాస నిరసన దీక్షలో సీఎం కేసీఆర్

KCR at TRS Protest in Delhi : కేంద్రం పంట మార్పిడి చేయమందని తాము రైతులకు చెబితే.. రాష్ట్ర భాజపా నేతలు మాత్రం వరి వేయమని కర్షకులను రెచ్చగొట్టారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దిల్లీలో రైతులకు అండగా ప్రజాప్రతినిధుల నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన కేంద్రంపై వడ్ల వార్‌ను ప్రకటించారు. రైతులు ధాన్యం పండించండని.. తాము కొంటామని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోతలు మొదలైననాటి పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. తాము దిల్లీలో ధర్నా చేస్తే.. పోటీగా భాజపా నేతలు హైదరాబాద్‌లో నిరసన చేస్తున్నారని మండిపడ్డారు. ఏ ఉద్దేశంతో భాజపా నేతలు భాగ్యనగరంలో ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

చేతులు జోడించి అడుగుతున్నా..

ఆ మాటలు మరిచిపోం.. : సాగు చట్టాలపై కేంద్రానికి వ్యతిరేకంగా.. రైతులకు అండగా అలుపెరగని పోరాటం చేసిన టికాయత్‌ను ఎన్నో రకాలుగా కేంద్రం అవమానించిందని కేసీఆర్ అన్నారు. టికాయత్‌ను దేశ ద్రోహి, ఉగ్రవాది అన్నారని గుర్తుచేశారు. కర్షకుల కోసం ఎన్నో అవమానాలకు.. మరెన్నో కష్టాలను భరిస్తూనే ఆయన ముందుకు సాగుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజానీకం, తెరాస శ్రేణులు టికాయత్ వెంట ఉంటాయని మాటిచ్చారు. తెలంగాణ ప్రజానీకంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ చేసిన అవమానకర వ్యాఖ్యలను గుర్తుపెట్టుకుంటామని అన్నారు.

పనిలేక వెళ్లామా.. ? : "మా మంత్రులకు పని లేక పీయూష్ గోయల్ వద్దకు వెళ్లారా? మా మంత్రులను ఎలా అవమానిస్తారు? ప్రజలను, రైతులను అవమానించిన ఏ ప్రభుత్వం నిలిచినట్లు చరిత్రలో లేదు. హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులే కాలగర్భంలో కలిసిపోయారు. ఇక మోదీలు, అమిత్ షాలు, పీయూష్ గోయల్‌లు ఎంత? పీయూష్ గోయల్ పారిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మోదీకి రైతుల కోసం ఖర్చు పెట్టేందుకు పైసలు లేవా.. మనసు లేదా? దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు. భాజపా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. అంతిమ విజయం సాధించేంత వరకు విశ్రమించేది లేదు."

- కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి

చేతులు జోడించి అడుగుతున్నా.. : "కేంద్రానికి ఎదురుతిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేస్తారు. భాజపాలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా?. నన్ను జైలుకు పంపుతామని రాష్ట్ర భాజపా నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామంటారా? దమ్ముంటే రండి. ధాన్యం కొనుగోలు కోసం దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. ఒకే విధానం లేకపోతే రైతులు రహదారులపైకి వస్తారు. బోర్లకు మీటర్లు పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. మోదీ, పీయూష్‌ గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నాను."

- కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి

థాంక్యూ టికాయత్ : కేంద్రం ధాన్యం కొనాలని దిల్లీలో దీక్ష చేస్తున్నామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన టికాయత్‌కు ధన్యవాదాలు తెలిపారు. దిల్లీకి ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరని ప్రశ్నించారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ.. రైతులతో పడొద్దని హితవు పలికారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని అన్నారు.

రైతు సంస్కరణలు : దేశవ్యాప్తంగా ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయని కేసీఆర్ పునరుద్ఘాటించారు. మోటార్‌, విద్యుత్‌ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సాగు రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని గుర్తు చేశారు. తెలంగాణ రైతుల ఆత్మహత్యలు భారీగా ఉండేవని అన్నారు. 6 దశాబ్దాలపాటు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడామని చెప్పారు. రాష్ట్ర సాధనలో వందలాది మంది యువత బలిదానాలు చేసిందని స్మరించుకున్నారు. ఉద్యమాల పోరాట ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చామన్న కేసీఆర్.. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించామని వ్యాఖ్యానించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.

Last Updated : Apr 11, 2022, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details