CM KCR Comments: దమ్ముంటే తనను జైలుకు పంపాలని భాజపా నేతలకు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించిన కేసీఆర్.. కేంద్రాన్ని జైలుకు పంపటం మాత్రం పక్కా అని కీలక వ్యాఖ్యలు చేశారు. రఫేల్ విమానాల కొనుగోలు విషయంలో రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను సీఎం ప్రస్తావించారు. రఫేల్ డీల్ విషయంలో కుంభకోణం జరిగిందని.. తాము కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. అలాంటి ఎన్నో అక్రమాలకు సంబంధించిన చిట్టా తనదగ్గరుందని తెలిపారు. మెల్లమెల్లగా కేంద్రం చేసిన ఒక్కో అవినీతిని బయటపెడతామని పేర్కొన్నారు.
దిల్లీలో పంచాయితీ పెడతా..
"33 మంది దేశంలోని వివిధ బ్యాంకులను ముంచి లండన్‌లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. వారిలో చాలా మంది మోదీ దోస్తులే. ఎక్కువ మంది గుజరాత్‌కు చెందినవారే. అందుకే భాజపాను దేశం నుంచి తరిమికొట్టాలని చెబుతున్నాం. వీళ్లని తరిమికొట్టకపోతే దేశం నాశనమైపోతుంది. రఫేల్ జెట్ విమానాల కొనుగోలులో గోల్‌మాల్ జరిగింది. వేల కోట్లు మింగారు. మనకంటే చౌకగా ఇండోనేషియా రఫేల్ విమానాలు కొన్నది. భాజపా అవినీతి గురించి దిల్లీలో పంచాయితీ పెడతా. భాజపా నేతలకు దమ్ముంటే వీటిపై మాట్లాడాలి. మేం మిమ్మల్ని జైలుకు పంపేది పక్కా. భాజపా పాలకుల అవినీతి చిట్టా నా దగ్గర ఉంది. బడ్జెట్‌ను నేను సరిగా అర్థం చేసుకోలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు. రూ.34,900 కోట్ల ఎరువుల సబ్సిడి తగ్గించింది అబద్దమా?. ఉపాధి హామీ పథకానికి రూ.25వేల కోట్ల తగ్గింపు నిజం కాదా?. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన విషయం వాస్తవం కాదా?"-సీఎం కేసీఆర్
మళ్లీ పెట్రోల్ రేట్లు పెంచుతారు..
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత పెట్రోల్ రేట్లు పెంచుతారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీ.. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తరఫున ప్రచారం చేయడం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. అమెరికా ఎన్నికలు .. అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలా..? అంటూ ఎద్దేవా చేశారు. అమెరికా ఎన్నికల కోసం మోదీ ప్రచారం వ్యూహాత్మక తప్పిదమని విశ్లేషించారు. భాజపా తన సిద్ధాంతాలు గాల్లో కలిపేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవకపోయినా పాలించే సిగ్గులేని పార్టీ భాజపా అని విమర్శించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్‌లో గెలవకపోయినా భాజపా పాలిస్తోంది. మహారాష్ట్రలోనూ గెలవకపోయినా పాలించాలని యత్నించి.. బోల్తా పడ్డారని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: