JAGAN DELHI TOUR: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఏడేళ్లు గడిచినా ఇప్పటి వరకు విభజన సమస్యలు పరిష్కారం కాలేదని, రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన పలు హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, వాటిని సత్వరమే నెరవేర్చాలని ప్రధానిని సీఎం కోరనున్నట్లు తెలిసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని ఇప్పటికే పలు సార్లు కోరిన సీఎం.. ఈ విషయమై మరో సారి విజ్ఞప్తి చేయనున్నారు.
పోలవరం బకాయిల కోసం...
జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు. తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న జల వివాదాలపైనా ప్రధానితో సీఎం చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ బోర్డులకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నా... రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు పూర్తి సానుకూలత వ్యక్తం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను అప్పగిస్తే తామూ అప్పగిస్తామని స్పష్టం చేసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు సాగునీటి ప్రాజెక్టులను అప్పగించే విషయంపై పీటముడి నెలకొన్న పరిస్ధితుల్లో ఈ విషయంపైనా ప్రధానితో.. సీఎం చర్చించే అవకాశాలున్నాయి. మూడు రాజధానుల అంశం సహా అమరావతి అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికల పైనా చర్చించే అవకాశాలున్నాయి.