CM JAGAN: కరోనా మహమ్మారి ప్రభావంతో రెండేళ్ల విరామం తర్వాత... ప్రపంచ ఆర్థిక సంఘం సదస్సు ఈ నెల 22 నుంచి 26వరకూ జరగనుంది. ఏపీ నుంచి ఆ రాష్ట్ర సీఎం జగన్ తోపాటు, మంత్రులు, అధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ సీఎం కీలక చర్చలు జరపనున్నారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సు ద్వారా ప్రస్తావించనున్నారు. కొవిడ్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ అనుసరించిన ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ అంశాల్ని వివరించనున్నారు.
ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన మార్పులు, నవరత్నాల అమలు, అధికార వికేంద్రీకరణ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో వచ్చిన మార్పుల్ని తెలియచేయనున్నారు. సంప్రదాయ ఇంధన వనరుల రంగం, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి అంశాలపైనా ఈ సదస్సులో దృష్టిసారించనున్నారు. కాలుష్యంలేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా చేపట్టిన కార్యక్రమాల్ని సీఎం జగన్ వివరించనున్నారు. ఈ మేరకు రాత్రికి దావోస్‌కు జగన్ చేరుకోనున్నారు.
సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్ కనెక్టివిటీ, రియల్‌టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్ అంశాల వివరణకు అధికారులు దావోస్‌లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. "పీపుల్ –ప్రోగ్రెస్ –పాజిబిలిటీస్" నినాదంతో ఈ పెవిలియన్ జరుగుతోంది. ఇండిస్ట్రియలైజేషన్ 4.0కు వేదికగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వనరులు, అవకాశాలు, మౌలిక సదుపాయాలను వివరించనున్నారు.