తెలంగాణ

telangana

ETV Bharat / city

'అమ్మఒడి' పేద విద్యార్థులకు శ్రీరామరక్ష: సీఎం జగన్

అమ్మఒడి పథకం కింద వచ్చే ఏడాది నుంచి డబ్బులకు బదులు ల్యాప్ టాప్‌లు తీసుకొనే అవకాశం కల్పిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అమ్మఒడి పథకంలో భాగంగా రెండో విడత చెల్లింపులను ఆయన నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు. ఇన్ని సంక్షేమ పథకాల అమలును ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. అందులో భాగంగానే ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు.

'అమ్మఒడి' పేద విద్యార్థులకు శ్రీరామరక్ష: సీఎం జగన్
'అమ్మఒడి' పేద విద్యార్థులకు శ్రీరామరక్ష: సీఎం జగన్

By

Published : Jan 12, 2021, 2:48 AM IST

'అమ్మఒడి' పేద విద్యార్థులకు శ్రీరామరక్ష: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్​లో పేదింటి పిల్లలు బడికి వెళ్లి, ఉన్నత చదువులు చదవాలంటే..అమ్మ ఒడి శ్రీరామరక్ష అని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. పేదలు తమ పిల్లలను చదివించలేక కూలీ పనులకు పంపిన సందర్భాలను పాదయాత్ర సమయంలో చూశానని... వారి బాధలను తీర్చడానికే అమ్మఒడి పథకం తీసుకొచ్చామన్నారు. నెల్లూరులో రెండో విడత అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టిన ఆయన...44లక్షల 48వేల 865 మంది తల్లుల ఖాతాల్లో 6 వేల 673కోట్ల రూపాయలను జమ చేశారు. కార్యక్రమంలో మంత్రులు బాలినేని, మేకపాటి గౌతం రెడ్డి, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

'జగన్ మామ చూసుకుంటాడు'

గత ప్రభుత్వాలు విద్యార్థులు చదువుకోవటానికి పుస్తకాలు సక్రమంగా ఇచ్చేవారు కాదని విమర్శించారు. గదులు, మరుగుదొడ్లు, ఎక్కువ ఫీజులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని వ్యాఖ్యానించారు. ఇకనుంచి అలాంటి బాధలు ఉండవని.., జగన్ మామ చూసుకుంటాడని విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోతే..1902కి కాల్ చేయవచ్చని సూచించారు. స్వయంగా సీఎంవో కార్యాలయమే రంగంలోకి దిగుతుందని భరోసానిచ్చారు. యునిసెఫ్ లెక్కల ప్రకారం 12 నుంచి 22 శాతం మంది బాలికలు విద్యను మధ్యలోనే మానేస్తున్నారని...పాఠశాలల్లో మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవటం వల్లే ఈ సమస్య ఎదురవుతోందన్నారు. టాయిలెట్స్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు.

వచ్చే ఏడాది ల్యాప్​టాప్​లు అందిస్తాం

9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు కోరుకుంటే..వచ్చే ఏడాది అమ్మఒడి నగదుకు బదులుగా ల్యాప్​ట్యాప్​లు అందిస్తామని వెల్లడించారు. ఏ విద్యార్థి అయినా రెండు రోజులు పాఠశాలకు రాకపోతే..మూడవ రోజు సంబంధిత వాలంటీర్ విద్యార్థి ఇంటికి వెళ్లి పరిస్థితిని తెలుసుకుంటారన్నారు. ప్రతి విద్యార్థి బాధ్యతను గ్రామ సచివాలయం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. అమ్మఒడి ద్వారా ఇచ్చే 15 వేలల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ కింద రూ. వెయ్యి తిరిగి తీసుకుంటున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్వహణను ప్రతి విద్యార్థి ప్రశ్నించాలనే ధ్యేయంతోనే ఈ విధంగా చేస్తున్నామన్నారు.

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్

అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని సీఎం జగన్ పునరుద్ఘాటించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. మూడు సంవత్సరాల్లో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. అందులో భాగంగానే ఆలయాలపై దాడులు చేస్తున్నారన్నారు.

ఇదీచదవండి:ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభం

ABOUT THE AUTHOR

...view details