ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇలా మాట్లాడలేదు. దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారు. తిట్లు విని భరించలేని అభిమానులు స్పందిస్తున్నారు. కావాలని తిట్టించి వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. వైషమ్యాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకుంటున్నారు. -వైఎస్ జగన్, ఏపీ సీఎం
వైకాపా సర్కార్‌పై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని.. అందుకే దారుణమైన పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు. ‘జగనన్న తోడు’ వడ్డీ చెల్లింపు కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అలా మాట్లాడలేదన్నారు. టీవీల్లో బూతులు విని భరించలేని అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. కులాలు, మతాల మధ్య విపక్షం చిచ్చు పెడుతోందన్నారు. కావాలనే వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా లబ్ధిపొందాలనే ఆరాటం రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. వ్యవస్థలను పూర్తిగా మేనేజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. జగన్‌కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కోర్టు కేసులు వేయిస్తున్నారని విమర్శించారు. రెండున్నర ఏళ్లలో అందరినీ సంతృప్తి పరిచేలా పాలన చేశానని.. ఇకపైనా అలాగే కొనసాగిస్తానని జగన్ వివరించారు.